సుశాంత్ కేసులో రియా చక్రవర్తిపై ఎన్సీబీ అభియోగాలు

సుశాంత్ కేసులో రియా చక్రవర్తిపై ఎన్సీబీ అభియోగాలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో పురోగతి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 2020లో మరణించిన బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం నటి రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అభియోగాలు నమోదు చేసింది. అంతేకాదు ఆమె సోదరుడు షోక్ చక్రవర్తిని కూడా నిందితుడిగా చేర్చారు. మరో 34మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి, సుశాంత్ సింగ్ కు డెలివరీ చేసినట్లు, దాని కోసం ఆమె చెల్లింపులు కూడా జరిపినట్లు ఎన్సీబీ పేర్కొంది.

ఈ కేసులో రియా చక్రవర్తి సెప్టెంబర్ 2020లో అరెస్టయ్యారు. ఆమె అరెస్టయిన దాదాపు నెల తర్వాత ముంబయి హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 14, 2020న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో నటుడు సుశాంత్ సింగ్ (34) మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్, టెలివిజన్ రంగంలో డ్రగ్స్ వినియోగంపై ఎన్సీబీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ కేసులో గనక రియా దోషిగా తేలితే.. ఏకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.