దేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా నేనున్నాంటూ ముందుకొచ్చి సహాయం చేసే ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. వనపర్తి జిల్లాలో మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ప్రారంభించారు. జిల్లాలోని సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్ ను ప్రారంభించారు. అదే విధంగా హైదరాబాదులోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాల ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను బహూకరించారు.
ఈ సందర్భంగా సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మకు సోనూ సూద్ అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలంటూ ప్రోత్సహించారు. అంబులెన్స్ స్వచ్ఛందంగా ప్రధానం చేయడం అంటే ప్రాణాలను రక్షించడం లాంటిదే అని పేర్కొన్నారు. సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోను సూద్ అంబులెన్స్ ను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని కోరారు.
జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఆటో కార్మికులకు ఉచితంగా ఆటోలను అందించడం అంటే కుటుంబాలను నిలబెట్టడం అని ఫౌండర్ కొండ కృష్ణమ్మకు అభినందనలు తెలిపారు. అవకాశాన్ని ఉపయోగించుకుని కుటుంబాలకు అండగా నిలవాలని ఆటో కార్మికులకు హితువు చెప్పారు.
మాల్యవి కరణోదయ సొసైటీని 2004 ఫౌండర్ కొండా కృష్ణమ్మ హైదరాబాదులో స్థాపించారు. 22 సంవత్సరాలుగా ఈ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ గాంధీ, నీలోఫర్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో నిత్యాన్నదానం చేస్తూనే ఉన్నారు. చాలామంది నిరుపేదల సొంతింటి కళ సహకారమయ్యేలా వారి ఇంటి నిర్మాణం కోసం మెటీరియల్ సప్లై చేశారు.
అంతే కాకుండా కరోనా సమయంలో కూడా సొసైటీ సేవలను ఆపకుండా మరింత విస్తృతంగా చేశారు. మహిళలకు ఉపాధి కోసం కుట్టుమిషన్లను కూడా బహుకరించారు. మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో చేస్తూ సమాజం మీద తమ ప్రేమను, బాధ్యతను కొనసాగిస్తామని సోసైట్ చైర్మన్ కొండా కృష్ణమ్మ తెలిపారు. తమను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చిన రియల్ హీరో సోనూ సూద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో పేదవారికి అండగా ఉంటూ అందరి ఆశీర్వాదంతో సొసైటీని ఇలాగే అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
