
‘మసూద’ గోపీ గుర్తున్నాడుగా.. అతనే తిరువీర్. ఇపుడు ఈ యంగ్ హీరోకి టీనా శ్రావ్య జంటగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో సందీప్ అగరం, అష్మితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. నవంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా, మంగళవారం (Sept30న) ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ పాటకు సనారే క్యాచీ లిరిక్స్ రాయగా, యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ కలిసి పాడారు. ‘వయ్యారి వయ్యారి, తిప్పుకు తిరిగే ఓ నారీ.. నీ ఎనకే నా మనసే పడిపోయే జారి. సింగారి సింగారి ఒంటరి మదిలోకే దూరి, నా ప్రాణం మొత్తాన్ని చేశావే చోరీ..’ అంటూ సాగిన పాటలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జనరేట్ అయ్యే కామెడీ అందరినీ అలరించేలా ఉంటుందని మేకర్స్ చెప్పారు.
తిరువీర్ సినిమాల విషయానికి వస్తే..చిన్నప్పటినుండి ఆయనకీ నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాటక రంగంలో అడుగుపెట్టాడు తిరువీర్. ఆ తరువాత కొంతకాలం రేడియో జాకీగా చేసిన ఆయన.. బొమ్మలరామారం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస 1978, టక్ జగదీష్ వంటి సినిమాలు చేసారు.
ఇలా ఇన్ని సినిమాలు చేసిన పెద్దగా తెలియని తిరువీర్.. 2022లో వచ్చిన మసూద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హారర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తిరువీర్ భగవంతుడుతో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.