
నటి నైనా గంగూలీ అంటే సినీ ప్రియుల్లో తెలియని వారుండరు. ఆర్జీవీ 'వంగవీటి' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చిక్కుల్లో పడింది. ప్రియుడి చేతిలో దారుణంగా మోసపోయింది. లేటెస్ట్ గా నైనా గంగూలీ సోషల్ మీడియాలో చేసిన సంచలన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన ప్రియుడు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, దీంతో గత మూడేళ్లుగా తాను సినిమాలకు దూరంగా ఉంటున్నానని ఆమె వెల్లడించారు. ఈ పోస్ట్ ఆమె అభిమానులను, సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆర్జీవీతో అనుబంధం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'వంగవీటి' సినిమాతో నైనా గంగూలీ వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆర్జీవీ తీసిన 'డేంజరస్' చిత్రంలోనూ నటించింది. ఈ సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. వీటితో పాటు 'జోహార్', 'మళ్లీ మొదలైంది', 'తగ్గేదే లే' వంటి చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. మంచి కెరీర్ అవకాశాలు వస్తున్న సమయంలో, గత మూడేళ్లుగా ఆమె అకస్మాత్తుగా తెరమరుగవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్‌తో ఆ ప్రశ్నకు సమాధానం లభించింది.
ప్రేమే నాకు శాపంగా మారింది
నైనా గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, కోల్‌కతాకు చెందిన ఒక కొరియోగ్రాఫర్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. "గత మూడేళ్లుగా నేను పనిచేయకపోవడానికి ఒక కారణం ఉంది. ప్రేమలో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా ప్రియుడు నన్ను నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపుల వల్ల నేను మానసికంగా కృంగిపోయాను. నా కెరీర్, ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ, సంబంధాల పట్ల తనకున్న అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని ఆమె పేర్కొంది. త్వరలో తనను వేధిస్తున్న ఆ వ్యక్తి పేరును బయటపెడతానని కూడా నైనా గంగూలీ హెచ్చరించారు.
హెచ్చరికలు వస్తున్నా భయపడేది లేదు!
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నైనా గంగూలీ పేర్కొన్నారు. "ఇప్పటివరకు నేను చాలా సహనంతో ఉన్నాను. అంతా బాగుంటుందని ఆశించాను. అందుకే పనికి దూరంగా ఉన్నాను. కానీ ఇకపై నేను మౌనంగా ఉండను. ఆ వ్యక్తి పేరును బయటపెడతాను. నేను ప్రేమించిన వ్యక్తి నుంచే నాకు ఇలాంటి బాధ ఎదురైందని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నా జీవితంలో రెండో అధ్యాయం మొదలుపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆమె తెలిపారు.
అయితే ఈ విషయంపై నైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఆరోపణలు నిజమైతే, అది ఆమె కెరీర్‌కే కాకుండా, ఆమె మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసుపై నైనా మరిన్ని వివరాలు వెల్లడిస్తేనే అసలు విషయం పూర్తిగా బయటపడుతుంది. అయితే, ప్రేమ పేరుతో ఆమె పడుతున్న బాధను చూస్తుంటే ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.