ఐదేళ్ల నుంచే అలరించిన అందాల రాశి

ఐదేళ్ల నుంచే అలరించిన అందాల రాశి

‘ఆనందమానందమాయె.. మది ఆశల నందనమాయె’ అంటూ ‘శుభాకాంక్షలు’ చెప్పింది.‘గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా’ అంటూ ‘గోకులంలో సీత’లా సుద్దులు నేర్పింది.‘మనసిచ్చి చూడు’ అంటూ ప్రేమ పాఠాలు బోధించింది. ‘పెళ్లిపందిరి’లోకి ప్రేక్షకుల్ని సాదరంగా ఆహ్వానించి అలరించింది. సంప్రదాయానికి ప్రతీకలా కనిపించి.. తన పర్‌‌ఫార్మెన్స్ తో అందరినీ మెప్పించి..ముప్ఫై ఆరేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా కొనసాగుతున్న ఆమె మరెవరో కాదు..రాశి. ఇవాళ తన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాశి’ గురించి కొన్ని విశేషాలు..


చిన్నిప్పటినుండే సినీ వాతావరణంలో

1981లో ఇదే రోజున చెన్నైలో జన్మించింది రాశి. తండ్రిది చెన్నై కాగా..తల్లిది మాత్రం భీమవరం. రాశికంటే ముందు వారికి ఒకబ్బాయి ఉన్నాడు. రాశి తాతగారు పద్మాలయ, విజయ వాహిని స్టూడియోస్‌కి జూనియర్ ఆర్టిస్టుల్ని సప్లై చేసేవారు. ఆమె తండ్రి చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత డ్యాన్సర్‌‌గా మారాడు. రాశి వాళ్ల నానమ్మ, భానుమతి బెస్ట్ ఫ్రెండ్స్. రాజబాబు, గుమ్మడి, జమున, సావిత్రి వాళ్లంతా రాశి వాళ్ల నానమ్మ, తాతయ్యలతో క్లోజ్‌గా ఉండేవారట. దాంతో చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగింది రాశి.

ఐదేళ్ల వయస్సులోనే 

ఐదేళ్ల వయసులోనే నటించడం మొదలుపెట్టింది రాశి. ఆమె మొదటి సినిమా ‘మమతల కోవెల’. నిజానికి ఆమెకి నటనంటే ఇష్టం లేదు. తండ్రి కోరిక కాదనలేక యాక్టర్ అయ్యానని పలు ఇంటర్వ్యూస్‌లో చెప్పింది. క్యూట్‌ ఫేస్, ఎంత పెద్ద డైలాగ్‌నైనా ఈజీగా చెప్పేయడం, ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంప్రెసివ్‌గా ఉండటంతో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమస్ అయిపోయింది రాశి.  రావుగారిల్లు, బాల గోపాలుడు, ఆదిత్య 369, అంకురం లాంటి మంచి మంచి సినిమాల్లో బాలనటిగా కనిపించింది. ఒక మలయాళ చిత్రంలోనూ నటించింది.

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్

రాశి అసలు పేరు విజయ. సినిమాల్లోకి వచ్చాక రాశిగా మార్చుకుంది. అది కూడా ప్రారంభంలో కాదు. మొదట్లో ఆమె పేరు విజయ అనే పడేది. పెద్దయ్యాక తమిళ, మలయాళ సినిమాల్లో నటించేటప్పుడు మంత్ర అనే పేరుతో యాక్ట్ చేసింది. ఆ తర్వాత రాశి అనే పేరు పెట్టుకోగా..బాగా పాపులర్ కావడంతో ఇక దానికే ఫిక్సయ్యింది. హీరోయిన్‌గా రాశి కెరీర్‌‌ మొదలైంది కోలీవుడ్‌లో. ‘ప్రియం’ అనే  సినిమాతో తొలిసారి ఫిమేల్‌ లీడ్‌గా కనిపించిందామె. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ మూవీకి ఎన్.పాండ్యన్ డైరెక్టర్. ఆ వెంటనే బాలీవుడ్‌ వారి దృష్టి రాశిపై పడింది. ‘అంగారా’ అనే మూవీలో మిథున్ చక్రవర్తితో నటించే చాన్స్ వచ్చింది. అదే యేడు మిథున్‌తోనే ‘రంగ్‌బాజ్‌’ అనే సినిమా కూడా చేసింది. నెక్స్ట్ సినిమా కూడా అతనికి జోడీగానే. ఆ సినిమా పేరు ‘సూరజ్’. ఇలా  బ్యాక్‌ టు బ్యాక్ మిథున్‌తో మూడు సినిమాలు చేశాక సౌత్‌లో అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో తమిళ, తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హిందీలో ‘జోడీదార్’ అనే సినిమాలో నటించింది. ఇందులో కూడా మిథున్ చక్రవర్తే హీరో కావడం విశేషం. 

ఒకే ఏడాదిలో 13సినిమాలు రిలీజ్

రాశి హీరోయిన్‌గా నటించిన మొదటి తెలుగు సినిమా ‘శుభాకాంక్షలు’. జగపతిబాబు హీరోగా నటించిన ఈ సినిమా సక్సెస్ కావడంతో రాశి చాలా బిజీ అయిపోయింది. వెంటనే గోకులంలో సీత, పెళ్లిపందిరి మూవీస్ చేసింది. అవి కూడా హిట్టయ్యాయి. దాంతో ఇక రాశికి తిరుగులేకుండా పోయింది. ఆమె ఎంత బిజీ అయిపోయిందంటే..1997లో ఆమె నటించిన ఐదు తమిళ సినిమాలు, నాలుగు తెలుగు సినిమాలు, రెండు హిందీ సినిమాలు విడుదలయ్యాయి. అంటే ఒకే సంవత్సరంలో పదకొండు సినిమాలు రిలీజయ్యాయన్నమాట. మూడేళ్ల తర్వాత ఇది మరోసారి రిపీటయ్యింది. 99లో అయితే ఆమెవి పదమూడు మూవీస్‌ రిలీజయ్యాయి. 


చీరకట్టు.. నుదుటిన బొట్టు..

చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేయడంతో రాశి చదువు సరిగ్గా సాగలేదు. ఎలాగో పదో తరగతి వరకు మాత్రం చదవగలిగింది. సినిమాల్లోకి వచ్చినా చదువుపై ఇష్టం పోలేదు. దాంతో బీఏ ఇంగ్లిష్‌ చేసింది. చదువు మీద, చిన్నపిల్లల మీద ఉన్న ఇష్టంతో ‘cuddle’ అనే ప్లే స్కూల్‌ కూడా పెట్టింది. కొన్ని సినిమాల్లో మోడర్న్ గా ఉండే పాత్రలు చేసినా..ట్రెడీషనల్‌ లుక్‌లోనే రాశిని ఎక్కువగా ఇష్టపడేవారంతా. అందుకే ఆమె ఎక్కువగా అలాంటి పాత్రలే చేసేది. చీరకట్టు.. నుదుటిన బొట్టు.. పొడవాటి జుట్టుతో పక్కింటి అమ్మాయిలా కనిపించేది. అదే ఆమెను తెలుగువారికి ఫేవరేట్ హీరోయిన్‌ని చేసిందనడంలో సందేహం లేదు. అయితే తమిళ సినిమా ‘రాజా’తో పాటు తెలుగులో సముద్రం, వెంకీ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది రాశి. ఇక ‘నిజం’లో ఆమె చేసిన నెగిటివ్‌ రోల్‌ చూసి ఈమె రాశియేనా అంటూ ఆశ్చర్యపోయారు ఆడియెన్స్.

ప్రేమించి పెళ్లాడి..

చాలా యేళ్లపాటు సక్సెస్‌ఫుల్‌గా సాగిన రాశి కెరీర్..2003 తర్వాత కాస్త స్లో అయ్యింది. ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు, దేవీ అభియం సినిమాలు చేశాక ఓ సంవత్సరం ఆమె సినిమాలేమీ రిలీజ్ కాలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ ఒక తమిళ సినిమా వచ్చింది. దాని తర్వాత నటనకు దూరంగా ఉండిపోయింది రాశి. కారణం.. ఆమెకి పెళ్లి అయ్యింది. ‘ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్ గా చేసిన శ్రీమునిని ప్రేమించి పెళ్లాడింది రాశి. ఆ తర్వాత కావాలనే బ్రేక్ తీసుకుంది.

సీరియల్స్ లో

ఏడేళ్ల తర్వాత ఒక తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రాశి. తెలుగులోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కళ్యాణ వైభోగమే, ఆకతాయి, లంక లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు లేకపోవడం వల్లో మరే కారణం చేతనో.. వెండితెరపై కనిపించలేదామె. అంతలో బుల్లితెర ఆమెను సాదరంగా ఆహ్వానించింది. రెండేళ్ల క్రితం ‘గిరిజాకళ్యాణం’ అనే సీరియల్‌లో నటించిన రాశి.. ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌లో యాక్ట్ చేస్తోంది. హీరోకి తల్లిగా హుందాగా ఉండే ఈ పాత్రలో ఆమె నటనకి మంచి మార్కులే పడుతున్నాయి. నిజానికి టెలివిజన్‌ రాశికి కొత్తేమీ కాదు. కెరీర్‌‌ ప్రారంభంలో కొన్నాళ్లు యాంకర్‌‌గా వర్క్‌ చేసిందామె. హ్యాపీ బర్త్ డే రాశి.