క్యారెక్టర్​ ఏదైతేనేం ఇంపార్టెన్స్​ ఉండాలి

క్యారెక్టర్​ ఏదైతేనేం ఇంపార్టెన్స్​ ఉండాలి

చూడ్డానికి అమాయకంగా, అందంగా కనిపించే ఈ అమ్మాయి, క్యారెక్టర్​లోకి దిగితే మాత్రం శివంగిలా మారిపోతుంది. ఇప్పటివరకు డీ గ్లామర్​ రోల్స్​లోనే ఎక్కువగా కనిపించింది. స్పోర్ట్స్​ డ్రామా సినిమాల్లో ఎదురులేని ఆడపులిలా ఆటాడేస్తుంది. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. మొదటి సినిమాకే బెస్ట్​ యాక్ట్రెస్​గా అవార్డు సొంతం చేసుకున్న ఆమే రజీష విజయన్​. 

తన మాతృభాష మలయాళంలో టీవీ షో హోస్ట్​గా కెరీర్​ స్టార్ట్ చేసింది. లేటెస్ట్​గా తమిళంలో ఎంట్రీ ఇచ్చి ధనుష్​, సూర్యలతో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ప్రెజెంట్ రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఇద్దరు హీరోయిన్​లలో ఒకరి​గా నటిస్తోంది. అంటే... త్వరలోనే తెలుగు ఆడియెన్స్​కి కూడా పరిచయం కాబోతుందన్నమాట. ఆమె గురించి మరెన్నో సంగతులు తన మాటల్లోనే...

‘‘కేరళలోని కాలికట్ జిల్లాలో పెరంబ్రా అనే ఊళ్లో1991లో పుట్టాను. అమ్మ పేరు షీలా, నాన్న విజయన్​. చిన్నప్పుడు ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు నేను కూడా వాళ్లలాగే యాక్టర్ అవ్వాలి అనిపించేది. కానీ, అమ్మ టీచర్. నాన్న ఆర్మీలో పనిచేసేవాళ్లు. దాంతో స్టడీ విషయంలో ఇద్దరూ​ చాలా స్ట్రిక్ట్. అందుకని నాకు ఎప్పుడూ చదువు మీదే దృష్టి ఉండేది. అప్పట్లో ల్యాప్​ టాప్ లేదు. మొబైల్స్​ ఫోన్స్​ వాడడం తెలియదు.  ఎగ్జామ్స్​ వస్తే టీవీ చూసేది లేదు. కాబట్టి సినిమాలు తక్కువ చూసేదాన్ని. కానీ, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కువే. అయితే ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. బ్యాక్​గ్రౌండ్ లేదు. అందువల్ల అటువైపు వెళ్లడం కష్టమనిపించింది. దాంతో డాక్టర్​ అవ్వాలని ఫిక్స్​ అయ్యా. మెడికల్ ఎంట్రన్స్​ టెస్ట్ కూడా రాశా. ఆ టైంలో సడెన్​గా.. ఒక రియలైజేషన్​. ‘నేను నా మనఃస్ఫూర్తిగా డాక్టర్​ అవ్వాలనుకోవట్లేదు’ అనే విషయం అర్థమైంది. 

దాంతో ఏం చేయాలా? అని మళ్లీ ఆలోచించాను. అప్పుడు జర్నలిజం అయితే బెటర్ అనిపించింది. పేరెంట్స్​కి చెప్పాను. వాళ్లు నన్ను సపోర్ట్ చేశారు. ‘ఎందుకు డెసిషన్ మార్చుకున్నావ్? అని కూడా అడగలేదు. కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయితే చెయ్’​ అన్నారు. దాంతో ఢిల్లీలోని ‘అమిటీ యూనివర్సిటీ’కి అప్లై చేశాను. ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ప్రింట్ మీడియాకి వెళ్లాలనుకున్నా. సెకండ్ ఇయర్​లో సినిమాలు తీయాలి. డైరెక్ట్ చేయాలి అనిపించింది. తర్వాత టెలివిజన్​కి వెళ్లాలనుకున్నా. 

టీవీ షో హోస్ట్​గా...

‘కొత్త ఛానెల్​ కోసం కొత్త యాంకర్స్​ కావాలి’ అనే టీవీ యాడ్ చూసి, ఆడిషన్​కి వెళ్లాను. సూర్య మ్యూజిక్​ ఛానెల్​లో నా ఫస్ట్ షో ‘100%లవ్’తో యాంకరింగ్ స్టార్ట్ చేశా. అక్కడ చేరిన మూడు వారాల్లోనే ఒక ట్రావెలాగ్ కూడా చేశాను. తర్వాత వరుసగా సూర్య టీవీలో ‘సూర్య ఛాలెంజ్’ పేరుతో వచ్చిన ఆరు రియాలిటీ షోలకి హోస్ట్​గా చేశాను. తర్వాత ‘సుషీస్​ కోడ్’ పేరుతో మరో రియాలిటీ షో అదే ఛానెల్​లో చేశా. అది కూడా చాలా బాగా రన్ అవుతున్న టైంలో ‘మాజ్విల్ మనోరమ’ అనే మరో ఛానెల్​ నుంచి ఒక కొత్త షో చేసే ఆఫర్ వచ్చింది. 2013 నుంచి 2015 వరకు నా టెలివిజన్​ కెరీర్ సక్సెస్​ఫుల్​గా సాగింది. 

మొదటి సినిమా 

జర్నలిజం అయిపోగానే, టీవీలో యాంకరింగ్ చేస్తున్న నాకు మూవీ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, ఆఫర్ల గురించి మా ఇంట్లో చెప్పలేదు. ఒక మంచి కథ వస్తే చేయాలని ఎదురుచూశా.  అప్పుడే ‘అనురాగ కరిక్కిన్​ వెల్లం’ సినిమా ఆఫర్ వచ్చింది. వాళ్ల టీం మెంబర్స్​ నాకు ఫ్రెండ్స్​. దాంతో ధైర్యంగా వెళ్లి ‘యాక్టింగ్ చేస్తా’ అని ఇంట్లో అడిగా. అప్పుడు కూడా వాళ్లు వెంటనే ‘ఓకే’ చెప్పారు. ఆ సినిమాకి ‘కేరళ స్టేట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్​’ వచ్చింది. ఒకప్పుడు  టెలివిజన్​ షోలు హోస్ట్ చేసిన నేను ఇప్పుడు గెస్ట్​గా వెళ్లడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాది చాలా కష్టమైన క్యారెక్టర్. కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఎక్స్​ప్రెస్​ చేస్తే బాగోదు. దాంతో చాలా భయపడ్డా. అది కంప్లీట్​ అయ్యాక కూడా నాకు కాన్ఫిడెన్స్​ లేదు. రిలీజ్​ అయ్యాక జనం రియాక్షన్​ చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నేను యాక్టింగ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. 

కోలీవుడ్​ ఎంట్రీ 

ఒక సినిమా కోసం ఫొటోషూట్ చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ టైంలో డైరెక్టర్​ మారి సెల్వరాజ్ నా ఫొటోలు చూశాడు. నేను ఇంతకు ముందు ఏం సినిమాలు చేశానో కనుక్కున్నారు. ఆ సినిమాల్లో డిఫరెంట్ ఏజెస్​లో నా యాక్టింగ్, ఎమోషన్స్​​ ఆయనకు నచ్చాయట. దాంతో నేను ‘ఫైనల్స్’ అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రొడక్షన్​ టీం వచ్చి కలిశారు. ఆ సినిమాలో సైక్లిస్ట్​ రోల్ చేస్తున్న నాకు షూటింగ్​లో కాలికి దెబ్బ తగిలింది. తర్వాత కాలికి కట్టుకుని ఉన్నప్పుడు డైరెక్టర్ సెల్వరాజ్​ వచ్చారు. నాతో గంటన్నరసేపు మాట్లాడారు. అప్పుడు నాకు తమిళంలో ఒక్క పదం కూడా రాదు. అందుకని మలయాళమే తమిళ యాసలో మాట్లాడా. ఆయన ఐడియాలజీ నాకు బాగా నచ్చింది. తమిళంలో ‘కర్ణన్​’ కంటే ముందు వేరే సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, అవేవీ నాకు నచ్చలేదు. ‘కర్ణన్​’ ఆఫర్​ రాగానే మంచి సినిమా, మంచి క్యారెక్టర్​ అనిపించింది. అందుకే అదే డెబ్యూగా చేశా.  ఆ సినిమా చేయడానికి ముందు పది రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. షూటింగ్ జరిగే ఊళ్లో ప్రజలు ఎలా ఉంటారో అలానే ఉండాలని, నేచురల్​గా కనిపించాలన్నారు. దానికోసం పదిరోజులు షూటింగ్ చేయలేదు. ఊరివాళ్లను గమనించి, వాళ్లు చెప్పినవి నేర్చుకోమన్నారు. ఆ తర్వాతే నా సీన్స్ తీశారు. ఆ టైంలో మొదట భాష రాదని, రెండోది ధనుష్​లాంటి స్టార్​ హీరో పక్కన చేస్తున్నా.. ఎక్కువ టేక్​లు తీసుకుంటే ఎలా ఫీలవుతారో అని ఈ రెండు విషయాల్లో భయపడ్డా. కానీ, ధనుష్​ నన్ను బాగా ఎంకరేజ్​ చేశాడు. దాంతో నేను కంఫర్టబుల్​గా చేయగలిగాను. ఎప్పటికైనా ప్రపంచాన్ని చుట్టి రావాలనేది నా డ్రీమ్. కొత్త మనుషులతో మాట్లాడటం ఇష్టం. మ్యూజిక్ వింటా. ఇండియాలో ఉన్న ఐలాండ్స్​ అన్నీ చూసి రావాలనుకుంటున్నా. 

అవన్నీ ఒక్క సినిమాకే... 

ఏసియావిజన్, కేరళ స్టేట్ బెస్ట్ యాక్ట్రెస్, ఏసియానెట్ ఫిల్మ్, సీపీసీ సినీ, సెకండ్ ఐఫా ఉత్సవం, సైమా అవార్డులన్నీ మొదటి సినిమా ‘అనురాగ కరిక్కిన్ వెల్లం’(మలయాళం)కి వచ్చాయి. వనిత ఫిల్మ్, ఫిల్మ్​ ఫేర్​ సౌత్​ అవార్డులకు నామినేట్ అయ్యా. ‘జూన్​’ సినిమాకు బెస్ట్ సెకండ్ యాక్ట్రెస్​గా ‘రాము కర్యత్’​ అవార్డు దక్కింది. ఏసియానెట్ ఫిల్మ్, సైమా అవార్డులకు నామినేట్ అయింది. ‘ఫైనల్స్​, స్టాండ్ అప్’ సినిమాలు ఏసియా నెట్ ఫిల్మ్​ అవార్డ్స్​కి నామినేట్ అయ్యాయి. 

  • తమిళం, మలయాళంలో డిఫరెంట్ రోల్స్ చేశాను. 
  • వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం​ అనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. 
  • ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయలేను. అలా చేస్తే ఏదీ పర్ఫెక్ట్​గా చేసినట్టు అనిపించదు. ఒక సినిమా చేస్తున్నానంటే అది కంప్లీట్ అయ్యే వరకు వేరే ప్రాజెక్ట్​కి వెళ్లను. అందుకనే పదేండ్లలో ఐదు సినిమాలే చేశాను.