
శ్రియా శరణ్ ఇండస్ట్రీకొచ్చి ఈ నెలతో ఇరవయ్యేళ్లు పూర్తవుతోంది. అందుకే ఈ నెల 10న రిలీజవుతున్న ‘గమనం’ ఆమె కెరీర్‌లో ప్రత్యేకం. సుజనారావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురించి, తన పాత్ర గురించి శ్రియ చెప్పిన సంగతులివి. ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఇరవయ్యేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగానంటే ప్రేక్షకుల ప్రేమ, సపోర్టే కారణం. మా అమ్మ కెమిస్ట్రీ టీచర్. నాన్న బీహెచ్‌ఈఎల్ ఎంప్లాయీ. ‘ఇష్టం’ నా ఫస్ట్ మూవీ. నా సినిమాలు కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. అయినా ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వంగా ఉంది. మరో ఇరవయ్యేళ్లు ఇలానే నటిస్తూ ఉండాలనుంది.
కొన్నాళ్లుగా సినిమాల పట్ల నా పర్‌స్పెక్టివ్ మారింది. నా కూతురితో సహా నా ఫ్యామిలీ అంతా చూసి గర్వపడే సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఏ పాత్ర పోషించినా అది నా మనసుకు నచ్చాలి. ఈ కథ వినగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. కచ్చితంగా నటించాలని ఫిక్సయ్యాను. మనిషి లోపలి కాన్‌ఫ్లిక్ట్, జర్నీ గురించి చెప్పేదే ఈ ‘గమనం’. నిస్సహాయతతో ఉన్న మనిషికి ఒక్కసారిగా బలం వస్తే అడ్డంకులన్నీ దాటేస్తారు. డెలివరీ టైమ్‌లో నాకలాంటి భయం ఉండేది. ఏం కాదని ధైర్యం తెచ్చుకున్నాను. అంతా సాఫీగా సాగింది. అందరి జీవితాల్లోనూ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. ఎలా బయటపడ్డామన్నదే మన గమనం.
కమల అనే పాత్ర నాది. తనకి వినిపించదు కానీ మాట్లాడగలదు. డెఫ్ అండ్ డమ్ స్కూల్స్‌కి వెళ్లి, అన్నీ చూసి తెలుసుకున్నాను. ఈ క్యారెక్టర్ కోసం బట్టలు కుట్టడం కూడా నేర్చుకున్నాను. నేనో రూమ్‌లో ఇరుక్కుంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా సక్సెస్. ఇలాంటి క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కాదు. ఇన్స్పైర్ చేసే మూడు కథలుంటాయి. షూటింగ్ టైమ్‌లో నా ఫ్రెండ్ చనిపోయారు. ఆ బాధలోనే షూటింగ్ చేశాను. ఇతర భాషల్లో చేశాను కానీ తెలుగులో లేడీ డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. లేడీ డైరెక్టర్స్‌తో పని చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచమే మారుతుంది. మనలో మార్పులు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని నా కూతురు అనకూడదు. అందుకే ఇకపై చాలెంజింగ్ పాత్రలే చేస్తాను.
ప్రెగ్నెన్సీ తరువాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. బరువు పెరిగాను. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. దాని వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ బాగుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా
మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే అది మన శరీరంపైనా మంచి ప్రభావం చూపిస్తుంది.