తెలుగమ్మాయి యామిని భాస్కర్ 2014లో రభస సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. 2015 లో కీచక ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల, భలే మంచి చౌకబేరమ్, కొత్తగా మా ప్రయాణం.. ఇలా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా నటిస్తూ వచ్చింది.
కొంత గ్యాప్ తర్వాత యామిని భాస్కర్ నటించిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో నందు హీరోగా నటిస్తూ శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి నిర్మించాడు. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్ల ద్వారా డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా యామిని భాస్కర్ మాట్లాడుతూ ‘ఇందులో నా క్యారెక్టర్ పేరు శ్రావ్య. తన భర్తతో విడాకులు తీసుకుని ఓ పిల్లాడికి తల్లిగా, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్‌గా కనిపిస్తా. ఇదే సమయంలో సిద్ధార్థ్‌కు బ్రేక్ అప్ అయి ఉంటుంది. తను అన్ని వదిలేసి ఒక బస్తీలో ఉండడానికి వస్తాడు. అప్పుడు ఒక ప్రేమ కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. ఇదొక సహజమైన ప్రేమ కథ. అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది.
పెర్ఫార్మెన్స్‌కి చాలా స్కోప్ ఉన్న పాత్ర నాది. నందు చాలా జెన్యూన్ పర్సన్. తనతో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. ట్రైలర్ చూశాక చాలామంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు. మళ్ళీ స్క్రీన్ మీద చూడడం బాగుందని, సినిమాల్లో కంటిన్యూ చేయమని కోరారు. సురేష్ బాబు గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడం, రామానాయుడు స్టూడియోలో మా సినిమా పోస్టర్ చూడడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది.
ఇకపోతే.. 1992 సెప్టెంబరు 20న ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, విజయవాడలో యామిని భాస్కర్ జన్మించింది. ఆమె చదువంతా విజయవాడలోనే పూర్తి చేసింది. బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల యామిని తప్పుకుంది.
