న్యూఢిల్లీ : అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ లాభం జూన్ 2023 క్వార్టర్లో 44.41 శాతం పెరిగి రూ. 674 కోట్లకు చేరింది. తాజా క్వార్టర్లో ఖర్చులు బాగా తగ్గడం వల్లే లాభం పెరిగింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంపెనీ లాభం రూ. 469 కోట్లు మాత్రమే. కాకపోతే, జూన్ 2023 క్వార్టర్లో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ రెవెన్యూ భారీగా తగ్గడం గమనించదగ్గది.
అంతకు ముందు ఏడాది జూన్ క్వార్టర్లో రూ. 41,066 కోట్లుగా ఉన్న రెవెన్యూ తాజా జూన్ క్వార్టర్లో రూ. 25,809 కోట్లకు పడిపోయింది. ఆపరేషనల్‌గా, ఫైనాన్షియల్‌గా గ్రూప్ పటిష్టతను అదానీ ఎంటర్‌ప్రైజస్ రిజల్ట్స్ ప్రతిఫలిస్తాయని కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అదానీ జర్నీ అద్భుతంగా సాగుతోందని, ఇదే ట్రెండ్ కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో ప్రధానమైన కంపెనీగా అదానీ ఎంటర్‌ప్రైజస్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. చెన్నై ఫేజ్2 డేటా సెంటర్ ప్రాజెక్టులో 74 శాతం, నోయిడా డేటా సెంటర్ ప్రాజెక్టులో 51 శాతం, హైదరాబాద్ డేటా సెంటర్ ప్రాజెక్టులో 46 శాతం పనులను అదానీ కానెక్స్(గ్రూప్ కంపెనీ) పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.
అదానీ గ్రూప్ చేతికి సంఘి ఇండస్ట్రీస్
సంఘి ఇండస్ట్రీస్‌లో అదానీ గ్రూప్‌లోని అంబుజా సిమెంట్స్ మెజారిటీ వాటా దక్కించుకుంటోంది. ఇండియా పశ్చిమ ప్రాంతంలో సంఘి ఇండస్ట్రీస్ పెద్ద సిమెంట్ తయారీదారుగా పేరు పొందింది. సంఘి ఇండస్ట్రీస్ ఎంటర్ప్రైజ్ వాల్యూను రూ. 5 వేల కోట్లుగా లెక్కకట్టారు. డీల్ కింద సంఘి ఇండస్ట్రీస్‌లో అంబుజా సిమెంట్స్ 56.74 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్లు రవి సంఘి, ఆయన ఫ్యామిలీ నుంచి చేజిక్కించుకుంటుంది.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సంఘి ఇండస్ట్రీస్ క్లింకర్ యూనిట్‌కు ఏడాదికి 6.6 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. ఇక 6.1 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ కెపాసిటీ ఈ కంపెనీ సొంతం. సంఘిపురం వద్ద సంఘి ఇండస్ట్రీస్‌కి ఉన్న క్యాప్టివ్ జెట్టీ కెపాసిటీని పెంచాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
