న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లోకి వచ్చిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌డీఐల) లో సగం కంపెనీకి చెందిన ఆఫ్ షోర్ సంస్థల నుంచే ఉన్నాయని లండన్ న్యూస్ పేపర్ ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేయడంపై అదానీ గ్రూప్ ఫైర్ అయ్యింది. ఈ ఆఫ్‌షోర్ కంపెనీల్లో అదానీ గ్రూప్ ప్రమోటర్లకు ఎటువంటి ఓనర్‌షిప్ లేదని చెబుతూ సోమవారం ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ కిందటి నెల అదానీ గ్రూప్‌పై ఓ ఆర్టికల్ విడుదల చేసింది. అదానీతో సంబంధాలు ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీలు 2017– 2022 మధ్య అదానీ కంపెనీల్లో 2.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయని, ఇదే టైమ్‌లో గ్రూప్‌లోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలు 5.7 బిలియన్ డాలర్లలో ఇది 45.4 శాతానికి సమానమని రిపోర్ట్ చేసింది. గౌతమ్ అదానీ అన్నయ్య వినోద్ అదానీతో లింక్‌లు ఉన్న రెండు కంపెనీలు ఎక్కువగా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాయని ఆరోపించింది. ప్రస్తుతం వినోద్ అదానీ దుబాయ్‌లో నివసిస్తుండగా, ఆయనకు సిప్రీట్ సిటిజెన్‌షిప్ ఉంది.
పబ్లిక్‌లోని విషయాలు తమకు తగ్గట్టుగా..
గ్రూప్‌ను నాశనం చేయడానికి పోటీ పెరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోగలమని ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్టికల్‌కు స్పందనగా అదానీ గ్రూప్ పేర్కొంది. కానీ, సెక్యూరిటీస్ చట్టాలను పూర్తిగా ఫాలో అవుతున్నామని, ప్రమోటర్ల ఓనర్‌షిప్‌ను, ఫైనాన్సింగ్‌ను దాచి పెట్టడం లేదని వివరించింది. ‘ఈ స్టోరీ మార్కెట్, ఇతర మీడియాను తప్పుదోవ పట్టించింది. పొలిటికల్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం తాము ఈ విషయాలన్నీ పబ్లిక్‌గా చెప్పాల్సి వచ్చింది’ అని వెల్లడించింది. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అదానీ గ్రూప్ కంపెనీల్లోకి షెల్ కంపెనీల ద్వారా రూ.20 వేల కోట్లు వచ్చాయని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘అదానీ ఫ్యామిలీ, అదానీ గ్రూప్‌పై తప్పుడు వార్తలు రాసి, కావాలనే వీరి పరువు తీయాలని చూస్తున్నారు’ అని అదానీ గ్రూప్ పేర్కొంది. ‘ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పిన లెక్కలన్నీ పబ్లిక్‌లో అందుబాటులో ఉన్నవే. అవి నిజమే. కానీ, ఈ డిస్‌క్లోజర్స్‌ను సరిగ్గా చదివి ఉంటే ‘ట్రేస్ చేయడానికి వీలులేని ఫ్లోస్’, ‘పారదర్శకంగా లేని విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు’, ‘ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని ఫండ్స్’ అనే పదాలను ఆర్టికల్‌లో రాయలేరు’ అని విమర్శించింది.
పబ్లిక్‌లో అందుబాటులో ఉన్న డిటెయిల్స్ ప్రకారం, 18 జనవరి 2021 నుంచి అదే నెల 23 మధ్య అదానీ గ్రూప్ ప్రమోటర్లు అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్‌లో 20 శాతం వాటాను అమ్మడం ద్వారా 2 బిలియన్ డాలర్లు సేకరించారు. అక్టోబర్, 2019 లో అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను అమ్మి మరో 700 మిలియన్ డాలర్లు సేకరించారు. ఈ 2.87 బిలియన్ డాలర్ల ఫండ్స్‌లో 2.55 బిలియన్ డాలర్లను తిరిగి కంపెనీ బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేశాం. కానీ, ఫైనాన్షియల్ టైమ్స్ ఈ విషయాలన్నింటినీ కావాలనే పట్టించుకోలేదు’ అని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సీ) వంటి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా ఇన్వెస్ట్ చేశాయని పేర్కొంది.
అదానీ షేర్లు జూమ్..
అదానీ గ్రూప్ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. మార్కెట్‌లో లిస్ట్ అయిన 10 అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సోమవారం పాజిటివ్‌గా కదిలాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్, ట్రాన్స్‌మిషన్ షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ టచ్ చేశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రెండున్నర శాతం పెరగగా, అదానీ పోర్ట్స్ షేర్లు 1.5% లాభపడ్డాయి. మిగిలిన షేర్లూ పాజిటివ్‌గా క్లోజయ్యాయి.
