పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ పనులను ఆపేసిన అదానీ గ్రూప్

పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ పనులను ఆపేసిన అదానీ గ్రూప్

తన గ్రూప్​కార్యకలాపాలను కన్సాలిడేషన్ చేయడంతోపాటు పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించేందుకు వనరులను సమకూర్చుకోవడానికి... ముంద్రాలో నిర్మించాల్సిన రూ. 34,900 కోట్ల పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ పనులను అదానీ గ్రూప్ ఆపేసింది. తదుపరి నోటీసు వచ్చే దాకా ప్రాజెక్టు కార్యకలాపాలు మొదలుకాబోవని వెండర్లకు, సప్లయర్లకు తెలియజేసింది

న్యూఢిల్లీ:  గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ముంద్రాలో నిర్మించాల్సిన రూ. 34,900 కోట్ల పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ పనులను అదానీ గ్రూప్ ఆపేసింది. అమెరికాకు  చెందిన షార్ట్ సెల్లర్ హిండన్​బర్గ్​రిపోర్ట్​ వల్ల కలిగిన నష్టాలను పూడ్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన గ్రూప్​కార్యకలాపాలను ఏకీకృతం చేయడంతోపాటు పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది.  సంస్థ  ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్​) 2021లో గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్​) జాగాలోగ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ కోల్ -టు పీవీసీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ పేరుతో సబ్సిడరీని స్థాపించింది. అదానీ గ్రూపులో అకౌంటింగ్ మోసం, స్టాక్ మానిప్యులేషన్స్, ఇతర కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల వంటి అవకతవకలు జరిగాయని హిండెన్​బర్గ్​ ఆరోపించింది. ఫలితంగా కంపెనీల మార్కెట్ విలువ జనవరి నుంచి సుమారు 140 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో ఆందోళన చెందుతున్నపెట్టుబడిదారులను శాంతింపజేయడానికి అదానీ గ్రూపు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని అప్పులను గడువు కంటే ముందే తీర్చేసింది. ఆపరేషన్స్​ను కన్సాలిడేట్​చేస్తోంది. ఆరోపణలపై ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తోంది. అందుబాటులో ఉన్న క్యాష్​ఫ్లో, ఫైనాన్స్ ఆధారంగా ప్రాజెక్టులను మరోసారి పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్​   ప్రాజెక్టును ఆపేసింది. ఈ విషయాన్ని సప్లయర్లకు, వెండర్లకూ తెలిపింది. 

మరిన్ని ప్రాజెక్టులకూ ఎవాల్యుయేషన్​ 

పెట్రోకెమ్​ ప్రాజెక్టును ఆపడంపై అడిగిన ప్రశ్నకు అదానీ గ్రూప్​ స్పోక్స్​పర్సన్​ స్పందిస్తూ రాబోయే నెలల్లోనూ ప్రాజెక్టులకు ఎవాల్యుయేషన్​​(మూల్యాంకనం) కొనసాగుతుందని అన్నారు.  "మా ఇండిపెండెంట్​ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో కంపెనీల బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా ఉంది. ప్రాజెక్ట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, ఎగ్జిక్యూషన్ విషయంలో మాకు మంచి పేరుంది. బలమైన కార్పొరేట్ గవర్నెన్స్, సురక్షితమైన ఆస్తులు, బలమైన నగదు ప్రవాహాలు, వ్యాపార ప్రణాళికకు సరిపడా నిధులు ఉన్నాయి. మా వాటాదారులకు మరింత మేలు చేయడంపై దృష్టి పెట్టాం”అని ఆయన వివరించారు. నిలిపివేసిన పాలీ-వినైల్-క్లోరైడ్ (పీవీసీ) యూనిట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి సామర్థ్యం 2,000 కేటీపీఏ (కిలో టన్​ పర్ ఆనమ్) ఉంది. దీని కోసం సంవత్సరానికి 3.1 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) బొగ్గును  దిగుమతి చేసుకోవాల్సి ఉంది. పీవీసీని ప్లాస్టిక్ పాలిమర్ అని కూడా అంటారు.  దీనిని మురుగునీటి పైపులు, ఎలక్ట్రికల్ వైర్లపై ఇన్సులేషన్, ప్యాకేజింగ్, అప్రాన్ల తయారీ మొదలైన వాటికి ఉపయోగిస్తారు. ఇండియాలో పీవీసీకి  దాదాపు 3.5 ఎంటీపీఏల డిమాండ్​ ఉంది. ఇది ఏటా 7 శాతం చొప్పున పెరుగుతుండటంతో అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను ప్లాన్ చేసింది.