
న్యూడిల్లీ : బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఇటీవల బహిరంగ మార్కెట్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్లో (ఏఈఎల్) తన వాటాను 1.32 శాతం పెంచుకున్నారని స్టాక్ ఎక్స్ఛేంజీలకు జూన్ 14 న కంపెనీ తెలిపింది. ఏఈఎల్‌లో ఈ వాటాను అదానీ రెండు విడతలుగా కొనుగోలు చేశారు. ఈ ఏడాది మే 10– మే 14 మధ్య, ఆయన కెంపాస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీలో 0.42శాతం అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. మే 21– జూన్ 12 మధ్య ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ డీఎంసీసీ ద్వారా 0.92శాతం వాటా కొన్నారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత ఈ ప్రకటన వెలువడింది. ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు రూ. 45.50 పెరిగి రూ.3,269 వద్ద ముగిశాయి.