పదేళ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు.. అదానీ టోటల్​ గ్యాస్​ ప్లాన్​

పదేళ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు.. అదానీ టోటల్​ గ్యాస్​ ప్లాన్​

న్యూఢిల్లీ: సిటీ గ్యాస్​ ప్రాజెక్టుల విస్తరణ కోసం రాబోయే పదేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ టోటల్​ గ్యాస్​ ప్లాన్​ చేస్తోంది. సీఎన్​జీ రిటెయిలింగ్​, ఇండ్లకు, పరిశ్రమలకు పైప్​ల ద్వారా అందించడానికి అవసరమైన ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను భారీగా పెంచాలనుకుంటున్నట్లు కంపెనీ సీఎఫ్​ఓ వెల్లడించారు. దేశంలోని 124 జిల్లాలలో పైప్​లైన్​ ద్వారా ఇండ్లలోని కిచెన్లకు, సీఎన్​జీ రిటెయిలింగ్​ కోసమూ 52 లైసెన్సులను కంపెనీ పొందింది. కుకింగ్​ గ్యాస్​ సరఫరా బిజినెస్​కు 7 లక్షల మంది కన్జూమర్లను అదానీ టోటల్​ గ్యాస్​ సంపాదించుకుంది. 

460 సీఎన్​జీ స్టేషన్లను ఇప్పటికే కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల సంఖ్యను పెంచాలనేదే కంపెనీ ఆలోచన. 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్లో అదనపు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఏర్పాటు కోసం కంపెనీ రూ. 1,150 కోట్లను వెచ్చించినట్లు సీఎఫ్​ఓ పరాగ్​ పారిఖ్​ వెల్లడించారు. గ్యాస్ ​ బిజినెస్​భవిష్యత్​ మరింత బాగుంటుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టీల్ పైప్​లైన్​ఏర్పాటును మరింత వేగంగా పూర్తి చేయడంతోపాటు, తమకు లైసెన్సు ఉన్న ప్రాంతాలలో కొత్తగా 1,800 సీఎన్​జీ స్టేషన్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు సీఈఓ సురేష్​ పీ మంగ్లాని వెల్లడించారు.