సోలార్‌‌‌‌‌‌‌‌ మాడ్యుల్స్ సరఫరాలో అదానీ సోలార్ రికార్డ్‌‌‌‌

సోలార్‌‌‌‌‌‌‌‌ మాడ్యుల్స్ సరఫరాలో అదానీ సోలార్ రికార్డ్‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ సోలార్  ఇప్పటివరకు 15వేల మెగావాట్ల (ఎండబ్ల్యూ) సోలార్ మాడ్యూళ్లను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసి,  ఈ మైలురాయిని అందుకున్న మొదటి ఇండియన్ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది.  ఇందులో 10వేల మెగావాట్లు భారత్‌‌‌‌లో వినియోగించగా, 5వేల మెగావాట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇవి 2.80 కోట్ల మాడ్యూళ్లకు సమానం. దాదాపు 7,500 ఫుట్‌‌‌‌బాల్ మైదానాల విస్తీర్ణాన్ని కవర్ చేస్తాయి. ఈ మాడ్యూళ్లలో 70శాతం అదానీ డెవలప్ చేసిన భారతీయ సోలార్ సెల్స్‌‌‌‌తో తయారయ్యాయి. 

మేక్ ఇన్‌‌‌‌ ఇండియా,  ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కంపెనీ కీలకంగా పనిచేస్తోందని అదానీ సోలార్ పేర్కొంది.  కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 4వేల మెగావాట్ల నుంచి 10వేల మెగావాట్లకు పెంచాలని, రాబోయే సంవత్సరాల్లో మరో 15వేల మెగావాట్ల సోలార్ మాడ్యుల్స్‌‌‌‌ను అమ్మాలని  లక్ష్యంగా పెట్టుకుంది. 

అదానీ సోలార్‌‌‌‌‌‌‌‌ ప్రపంచ టాప్ 10 సోలార్ మాడ్యూల్ తయారీదారుల్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ సంస్థగా నిలిచింది.  ఈ ఏడాది చివరి నాటికి భారత సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం 125 జీడబ్ల్యూ (గిగావాట్స్‌‌‌‌) దాటనుందని,  ఇది దేశీయ డిమాండ్ (40 జీడబ్ల్యూ) కంటే మూడింతలు ఎక్కువని వుడ్ మెకెన్జీ తాజాగా రిపోర్ట్‌‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

అదానీ సోలార్‌‌‌‌‌‌‌‌ దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో 35 చానల్ పార్ట్‌‌‌‌నర్లతో అతిపెద్ద సోలార్ మాడ్యూల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను నిర్వహిస్తోంది. ఈ 15వేల ఎండబ్ల్యూ మైలురాయి 50 లక్షల ఇళ్లకు విద్యుత్ అందించిందని,  2,500 గ్రీన్ ఉద్యోగాలు కల్పించిందని, 6 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాల నివారిచిందని అదానీ సోలార్ పేర్కొంది.  ఈ కంపెనీ రూఫ్‌‌‌‌టాప్ సోలార్  విభాగంలోనూ ముందుంది. గత సంవత్సరం 1.78 జీడబ్ల్యూ మాడ్యూళ్లు సరఫరా చేసింది.  5.94 లక్షల ఇళ్లకు విద్యుత్ అందించింది.