- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
తల్లాడ, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం తల్లాడ మండలంలోని నూతనకల్, రంగం బంజర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై ఆరా తీశారు. ధాన్యం ఎలా తీసుకురావాలో పలు సూచనలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన మిల్లులకు పంపాలని అధికారులకు సూచించారు. ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు 48 గంటల్లో ఆన్లైన్ చేసేలా ప్రతి అధికారి పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీలత, జిల్లా సివిల్ సప్లై అధికారి, చందన్ కుమార్, మండల ఆఫీసర్లు పాల్గొన్నారు.
కల్లూరు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, ధాన్య కొనుగోళ్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధిలోని లింగాల గ్రామంలో డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ పులి సాంబశివుడు, అగ్రికల్చరల్ ఏవో మాదా బత్తుల రూతో కలిసి ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
