హోమ్‌ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ ఈఎంఐ చూసి మోసపోకండి.. వెనుక ఉన్న అసలు ఖర్చులివే!

హోమ్‌ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ ఈఎంఐ చూసి మోసపోకండి.. వెనుక ఉన్న అసలు ఖర్చులివే!

హోమ్‌ లోన్ ఆఫర్లలో కనిపించే తక్కువ EMI నంబర్లను చూసి చాలామంది మోసపోతుంటారు. చూడటానికి ఇది చాలా తక్కువ భారంగా అనిపించినప్పటికీ.. లోన్ వెనుక ఉండే అనేక అదనపు ఛార్జీలు కాలక్రమేణా చెల్లించాల్సిన రుణ భారాన్ని భారీగా పెంచుతాయి. అందుకే లోన్ ఒప్పందంపై సంతకం చేసే ముందే దాగి ఉన్న ఖర్చుల గురించి పూర్తి అవగాహన ముఖ్యం. హోమ్ లోన్‌లో ఈఎంఐ మాత్రమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ & టెక్నికల్ వాల్యుయేషన్, స్టాంప్ డ్యూటీ వంటి అనేక ఇతర ఖర్చులు ఉంటాయి. కేవలం వడ్డీ రేటునే కాకుండా లోన్ తీసుకునేటప్పుడు ఏఏ అంశాలను బేరీజు వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

లోన్ తీసుకునే ముందు మీరు తప్పక గమనించాల్సిన ఆ ముఖ్యమైన ఛార్జీలు ఇవే:

1. ప్రాసెసింగ్ ఫీజు:
మీరు హోమ్ లోన్ కోసం అప్లే చేసినప్పుడు బ్యాంకులు వసూలు చేసే ముందస్తు ఖర్చు ఇది. లోన్ అప్రూవల్, డాక్యుమెంటేషన్ ప్రక్రియల కోసం బ్యాంకులు తమ నిర్వహణ ఖర్చుల కింద దీనిని తీసుకుంటాయి. లోన్ మొత్తాన్ని బట్టి ఇది కొంత శాతం ఉంటుంది.

2. లీగల్ & వాల్యుయేషన్ ఫీజు:
మీరు కొనే ఆస్తికి ఎలాంటి లీగల్ వివాదాలు లేవని, అలాగే ఆ ప్రాపర్టీ మార్కెట్ విలువ మీరు కోరుతున్న లోన్ మొత్తానికి సరిపోలుతుందని బ్యాంకులు నిర్ధారించుకుంటాయి. దీనికోసం లీగల్, టెక్నికల్ నిపుణులతో వెరిఫికేషన్ చేయిస్తాయి. ఈ ఖర్చులన్నీ క్లయింట్ ఖాతాలోనే పడతాయి.

3. స్టాంప్ డ్యూటీ & రిజిస్ట్రేషన్ ఖర్చులు:
చాలామంది హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ ఖర్చులను అంచనా వేయరు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర చట్టబద్ధమైన ప్రభుత్వ రుసుములు మొదట్లో చిన్నవిగా అనిపించినా, చివరకు ఇవి మీ జేబుకు పెద్ద మొత్తంలోనే చిల్లు పెడతాయి.

4. ప్రీపేమెంట్ & ఫోర్‌క్లోజర్ పెనాల్టీలు:
గడువు కంటే ముందే లోన్ మొత్తాన్ని పూర్తిగా గానీ, కొంత భాగాన్ని గానీ కట్టేసి అప్పు తీర్చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా ముందే కట్టేయడం వల్ల బ్యాంకులకు వచ్చే వడ్డీ నష్టపోతాయి. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకులు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీలు విధిస్తుంటాయి. లోన్ తీసుకునే ముందే ఈ నిబంధనలు సరిచూసుకోవాలి.

5. ఇన్సూరెన్స్ బండ్లింగ్ ఖర్చులు:
లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకులు.. హోమ్ లోన్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదా క్రెడిట్ ప్రొటెక్షన్ ప్లాన్లు తీసుకోవాలని ఒత్తిడి తెస్తుంటాయి. ఇవి భవిష్యత్తుకు మంచివే అయినప్పటికీ, వీటి ప్రీమియంలు లోన్ మొత్తానికి యాడ్ అవ్వడం వల్ల వడ్డీ భారం మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు తప్పనిసరా, ఆప్షనలా లేక బయట మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్నాయా అనేది ముందే చెక్ చేసుకోవడం ఉత్తమం.