అవమానిస్తూ పోతే సహించం : రంగినేని అభిలాష్ రావు

అవమానిస్తూ పోతే సహించం : రంగినేని అభిలాష్ రావు
  •     జూపల్లి తీరుపై ఫిర్యాదు చేస్తాం
  •     కొల్లాపూర్  ఆత్మీయ సమావేశంలో టీపీసీసీ సెక్రటరీ అభిలాష్ రావు

వనపర్తి/ వీపనగండ్ల, వెలుగు : నిన్న గాక మొన్న కాంగ్రెస్ లోకి వచ్చి పార్టీలో పని చేస్తున్న వారిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్దేశిస్తూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పేర్కొన్నారు. మంగళవారం చిన్నంబావి మండలంలో కాంగ్రెస్  పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. గతంలో కాంగ్రెస్  పార్టీని విడిచి వెళ్లి ద్రోహం చేశారని, మళ్లీ పదవి కోసం పార్టీలోకి వచ్చి కష్టపడి పని చేస్తున్న వారిని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూపల్లి తీరు ఇలాగే ఉంటే పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుందని హెచ్చరించారు. ఈ విషయంపై తాము పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. తనపై సోషల్  మీడియాలో జూపల్లి అనుచరులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. 

రంగినేనితో చిన్నారెడ్డి మంతనాలు..

కొల్లాపూర్  కాంగ్రెస్  పార్టీలో విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. సీనియర్  నేత జగదీశ్వర్ రావు, మరో పక్క రంగినేని అభిలాష్ రావు, తాజాగా జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా పార్టీ కార్యాలయాలు నడుపుతున్నారు. చిన్నంబావిలో రంగినేని అభిలాష్ రావు ఆఫీస్​ ఉండగానే జూపల్లి మరో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి చిన్నంబావి వెళ్లి అభిలాష్ కు మద్దతు ప్రకటించారు. వనపర్తి, నాగర్ కర్నూల్  పార్టీ వ్యవహారాల్లో అనవసర జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీలోనే కొనసాగాలని పార్టీ మారే ఆలోచన చేయవద్దంటూ రంగినేనిని బుజ్జగించారు.