బీఆర్​ఎస్​ సర్కార్​ లో వేములవాడ కు తీవ్ర నష్టం : అది శ్రీనివాస్

 బీఆర్​ఎస్​ సర్కార్​ లో వేములవాడ కు తీవ్ర నష్టం : అది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : గత పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్​ పాలనలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, కాంగ్రెస్​ ప్రభుత్వంలో వేములవాడ నియోజకవర్గంకి ప్రత్యేక నిధులు కేటాయించాలని అసెంబ్లీ సమావేశాల్లో వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్​ కోరారు. కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాల ప్రజలకు సాగు, తాగునీరుకు ఎంతో ఉపయోగపడే కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కుడి,ఎడమ కాలువలకు 2018 సంలో గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపనకే పరిమితమైందన్నారు.

వేములవాడ దేవస్థానాన్ని రూ. 400 కోట్లతో డెవలప్​ చేస్తామని బీఆర్​ఎస్​ ప్రభుత్వం హామీ ఇచ్చి మర్చిపోయిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి రూ. 20 కోట్ల నిధులను విడుదల చేశారన్నారు. -గుడి చెరువు లో మురికి నీరు కలవకుండా నూతన కాలువ నిర్మాణానికి ఎస్టీపి నిధులను విడుదల చేయాలని కోరారు. 

మేడిపల్లి, భీమారం,చందుర్తి మండల ప్రజలకు ఉపయోగపడే మోత్కరావుపేట్, -చందుర్తి రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు కల్పిస్తూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే మిడ్​ మానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. -వేములవాడ పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, మేడిపల్లి, భీమారం మండలాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేయాలని కోరారు.