
డెంటల్ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో 32 మంది నిందితులను ఇబ్రహీంపట్నం కోర్టు మేజిస్ట్రేట్ ముందు ఆదిభట్ల పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా..? అని మేజిస్ట్రేట్ అడిగారు. నిందితుల్లో కొంతమంది వయస్సు 19 సంవత్సరాలు ఉండడంతో వారు పుట్టిన తేదీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుల్లో కొంతమందికి గాయాలు ఉండడంతో అవి ఎలా అయ్యాయని మేజిస్ట్రేట్ అడగడంతో యాక్సిడెంట్ వల్ల గాయపడ్డామని నిందితులు తెలిపారు. అరెస్ట్ విషయాన్ని నిందితుల కుటుంబ సభ్యులకు తెలియజేశారా..? అని పోలీసులను మేజిస్ట్రేట్ అడిగారు.
తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని, తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తేలియదని నిందితుల్లో ఒకరు మేజిస్ట్రేట్ కు తెలిపారు. మరోవైపు ఈనెల 23వ తేదీ వరకూ నిందితులకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితులను చర్లపల్లికి తరలించారు.
యువతి కిడ్నాప్ కేసులో.. 32 మంది అరెస్ట్
డెంటల్ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో ఒక మైనర్ సహా 32 మందిని అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు విధ్వంసానికి పాల్పడ్డ మరో 40 మందికిపైగా పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే, నవీన్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి దామోదర్ రెడ్డి ఇంటిపై మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి (29) వంద మందితో వచ్చి దాడికి పాల్పడటం, ఆయన కూతురుని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. నిందితులకు శనివారం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకి తరలించారు. బాధితురాలు స్టేట్‌మెంట్ ను రికార్డ్ చేశారు. ఒంటిపై గాయాలు ఉండడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. యువతి కిడ్నాప్‌పై గవర్నర్ తమిళిసై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు, ఆమె ఫ్యామిలీకి భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.
కారులోనే దాడి.. యువతికి గాయాలు
కిడ్నాప్ చేసిన తర్వాత యువతిని కారులోనే బంధించి నల్లగొండ రూట్‌లో తీసుకెళ్లారు. యువతిపై నవీన్ రెడ్డి కారులోనే దాడి చేశాడు. పోలీసులు తమను వెంటాడుతున్నారని తెలియడంతో ఆమెను మరో కారులోకి ఎక్కించారు. మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ వద్ద వదిలి పారిపోయారు. బాధితురాలి నుంచి ఫోన్ వచ్చిన వెంటనే ఆమె తండ్రి దామోదర్‌రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను రెస్క్యూ చేసి సమీపంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్ళారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఒంటిపై గాయాలు ఉండడంతో వైద్యపరీక్షలు చేయించారు.
పెండ్లి కాలేదు.. ఫొటోలు మార్ఫింగ్ చేసిండు : బాధితురాలు
లాక్‌డౌన్ తరువాత బ్యాడ్మింటన్‌లో నవీన్‌రెడ్డి పరిచయం అయ్యాడు. నేనంటే ఇష్టమని పెండ్లి చేసుకోవాలని అడిగాడు. ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. నా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. పెండ్లి అయిందని చెప్తున్న రోజున నేను ఆర్మీ కాలేజ్ లో డెంటల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా. ప్రేమ, పెండ్లి అంటూ వేధింపులు ఎక్కువవడంతో మూడు నెలల కింద ఆదిబట్ల పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ప్రొటెక్షన్ కావాలి.