ఆట ఏదైనా సరే కచ్చితంగా కనిపించే పేరు ఏదంటే..

 ఆట ఏదైనా సరే కచ్చితంగా కనిపించే పేరు ఏదంటే..

అథ్లెటిక్స్​, క్రికెట్​, ఫుట్​బాల్​, బేస్​బాల్​, గోల్ఫ్​, టెన్నిస్​, హాకీ.. ఆట ఏదైనా సరే అందులో కచ్చితంగా కనిపించే పేరు ‘అడిడాస్’. ఆటగాళ్ల బట్టలపైన లేదా వాళ్ల చేతుల్లోని స్టోర్ట్స్​ కిట్స్​పైన.. అంటే ‌ఫుట్​బాల్​, బ్యాట్​, హాకీ స్టిక్​, గ్లౌజ్​, హెల్మెట్​, బాల్.. ఇలా ఏదో ఒకదాని మీద ఈ పేరు ఉంటుంది. ముఖ్యంగా ఆటగాళ్ల బూట్లపై కచ్చితంగా కనిపిస్తుంది. స్ట్పోర్ట్స్​ కిట్స్​, డ్రస్సెస్ తయారీకే కాదు, ఆటలు, ఆటగాళ్ల స్పాన్సర్​షిప్​కు కూడా ఫేమస్​ అయిన ‘అడిడాస్​’ బ్రాండ్​ వెనక ఒక వ్యక్తి కఠోర శ్రమ ఉంది. ఆయనే అడాల్ఫ్​ ‘అడి’ డసర్. ​     

జర్మనీలోని హెర్జొగెనారచ్​ అనే చిన్న టౌన్​లో నవంబర్​ 3, 1900లో పుట్టాడు అడాల్ఫ్​ అడి డసర్​. తల్లిదండ్రులు క్రిస్టోఫ్​, పౌలిన్​​. అడాల్ఫ్​కు ఇద్దరు అన్నలు ప్రిట్జ్​, రుడాల్ఫ్​, ఒక అక్క మేరీ. తండ్రి క్రిస్టోఫ్​ చెప్పుల ఫ్యాక్టరీ​లో పనిచేస్తుండేవాడు. తల్లి పౌలిన్​ లాండ్రీ షాపు నడిపేది. ఈ షాపు పనిలో తల్లికి సాయపడేవాడు అడాల్ఫ్​. కస్టమర్ల నుంచి బట్టలు తేవడం, తిరిగి ఇవ్వడం చేసేవాడు. అప్పుడప్పుడు తండ్రి పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్తూ​ చెప్పుల తయారీపై ఆసక్తి పెంచుకున్నాడు.1913లో హైస్కూల్​ చదువు పూర్తిచేశాడు​. కుటుంబ పరిస్థితి వల్ల పై చదువులకు వెళ్లలేకపోయాడు. ఒక బేకరీలో పనికి కుదిరాడు.  

ఆటలంటే పిచ్చి..

అడాల్ఫ్​కు ఆటలంటే పిచ్చి. స్నేహితుడు ఫ్రిట్జ్​ జెలీన్​తో కలిసి రకరకాల ఆటలు ఆడేవాడు. రన్నింగ్​ రేస్​, ఫుట్​బాల్​, బాక్సింగ్​, ఐస్​‌‌–హాకీ, జావెలిన్​, స్కీయింగ్​లో జెలీన్​తో కలిసి పార్టిసిపేట్​ చేసేవాడు. ఇలాంటి టైంలోనే ఆటగాళ్లు సరైన బూట్లు లేక ఇబ్బంది పడడం చూశాడు. ఎప్పటికైనా సరే ఆటగాళ్లకు సరిపడే బూట్లు తయారుచేయాలని అనుకున్నాడు.1918లో మొదటి ప్రపంచయుద్ధం మరికొన్ని నెలల్లో ముగుస్తుందనగా, మిలిటరీలో చేరాడు​​. జర్మనీ రూల్స్​ ప్రకారం18 ఏండ్లు వచ్చిన ప్రతి ఒక్కరూ సైన్యంలో ఏడాది పాటు కచ్చితంగా పనిచేయాలి. అందువల్ల​​ మిలిటరీలో చేరి 2019 అక్టోబర్​ వరకు పనిచేశాడు. తిరిగి ఇంటికొచ్చాక తన కలను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. 

లాండ్రీషాప్​ వాష్​రూమ్​లో..

తమ లాండ్రీషాప్​లోని వాష్​రూమ్​లో ప్రయోగాలు మొదలుపెట్టాడు అడాల్ఫ్​. అయితే, యుద్ధం కారణంగా అప్పటికి జర్మనీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. చెప్పులు, బూట్ల తయారీకి మెటీరియల్​ దొరకడం కష్టమైంది. కరెంట్​ కొరత కూడా తీవ్రంగా ఉండేది. దాంతో డబ్బు కోసం చెప్పుల్ని రిపేర్​ చేయడం మొదలుపెట్టాడు అడాల్ఫ్. అయితే, తన ప్రయోగాలు మాత్రం ఆపలేదు. సైనికులు వాడే షూ తెచ్చి, వాటిని ఆటగాళ్లకు అవసరమైనట్లు మార్చేవాడు. కరెంటు కోసం సైకిల్​ వెనక టైర్​కు లెదర్​ బెల్ట్​ కట్టి, దాన్ని మిషన్​ తగిలించాడు. సైకిల్​ పెడల్​ తొక్కుతుంటే ఆ బెల్ట్​ తిరుగుతూ కరెంట్​ వచ్చేది. పెడల్​ తొక్కడం కోసం ప్రత్యేకంగా జోసెఫ్​ అనే ఉద్యోగిని పెట్టాడు. అలా చివరికి ఆటగాళ్లకు సరిపడే బూట్లు(స్నీకర్స్​) తయారుచేశాడు. వాటి శాంపిల్స్​ను టౌన్​లోని స్పోర్ట్స్​ క్లబ్స్​కు పంపాడు. ఆటగాళ్లకు, మేనేజర్లకు, ట్రైనర్లకు ఆ బూట్లు బాగా నచ్చాయి. దాంతో ఆర్డర్స్​ ఎక్కువగా రావడం మొదలైంది. 

డసర్​ బ్రదర్స్​ స్పోర్ట్స్​ షూ ఫ్యాక్టరీ
తాను తయారుచేసిన బూట్లకు ఆర్డర్స్​ పెరగడంతో సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు అడాల్ఫ్. అదే టైంలో అతనికి అన్న రుడాల్ఫ్​ తోడయ్యాడు. దాంతో 1924, జులై 1న ‘గెబ్రూడర్​ డసర్​ స్పోర్ట్స్​షూఫ్యాబ్రిక్’ ఫ్యాక్టరీ పెట్టారు. మెటీరియల్స్​ తెచ్చి బూట్లు తయారుచేయడం అడాల్ఫ్​ పని. వాటి మార్కెటింగ్​ రుడాల్ఫ్​ చూసుకునేవాడు. మొదటి రెండేండ్లు ఆదాయం తక్కువగా వచ్చింది. 1926 నుంచి ఆర్డర్స్​ బాగా పెరిగాయి. దాంతో రెండో ఫ్యాక్టరీ పెట్టాల్సివచ్చింది. పనివాళ్లు కూడా పెరగడంతో రోజుకు వంద జతల బూట్లు తయారుచేసేవాళ్లు.

ఒలింపిక్స్​...​ఓవెన్స్​

‘డసర్​ బ్రదర్స్​ షూ’ను ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేసింది ఒలింపిక్స్​. 1928లో ఆమ్​స్టర్​డ్యామ్​లో ఒలింపిక్స్​ జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొంటున్న తమ దేశానికే చెందిన ట్రాక్ అండ్​ ఫీల్డ్​ అథ్లెట్​ లినా రడ్కేను అడాల్ఫ్​ కలిశాడు. డసర్​ స్నీకర్స్​ వేసుకొని పోటీలో పాల్గొనేలా ఒప్పించాడు. ​ఆమె ఆ బూట్లు వేసుకొని 800 మీ పరుగులో వరల్డ్​ రికార్డుతో గోల్డ్​ మెడల్​ గెలుచుకుంది. డసర్​ బూట్లు వేసుకోవడం వల్లే వేగంగా, కంఫర్ట్​గా పరిగెత్తగలిగినట్లు ఆమె చెప్పింది. అంతే, డసర్​ కంపెనీ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత లాస్​ఏంజెల్స్​(అమెరికా)లో జరిగిన1932 ఒలింపిక్స్​లో ఎక్కువ మంది ఆటగాళ్లు డసర్​ బూట్లతో బరిలోకి దిగారు. పతకాలు గెలిచారు. అదే టైంలో బూట్ల తయారీలో మెలకువల కోసం ఒక ట్రైనింగ్​ స్కూల్​కు అడాల్ఫ్​ కొన్ని రోజులు వెళ్లాడు. అక్కడ అతనికి పరిచయమైన కేథరిన్​ను1934 మార్చి17న పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు  ఐదుగురు పిల్లలు.

హార్ట్సే, ఇంగ్​, కరిన్​, బ్రిగెట్టె, సిగ్రిడ్​ 

1936లో ఒలింపిక్స్​ జర్మనీలోని బెర్లిన్​లో జరగడం అడాల్ఫ్​కు మరింత బాగా కలిసొచ్చింది. ఆ పోటీలకు వచ్చిన అమెరికా అథ్లెట్​ జెస్సీ ఓవెన్స్​ను అడాల్ఫ్​ కలిశాడు. డసర్​ స్నీకర్స్​ వేసుకునేందుకు ఒప్పించాడు.  ఆ పోటీల్లో ఓవెన్స్​ చరిత్ర సృష్టించాడు. ఏకంగా నాలుగు గోల్డ్​ మెడల్స్​ గెలుచుకున్నాడు. అతడి విజయంలో డసర్​ స్నీకర్స్​కు కూడా భాగముందని ఆటగాళ్లు నమ్మడంతో డిమాండ్​ అమాంతంగా పెరిగింది.  

రెండో ప్రపంచ యుద్ధంతో తలకిందులు

1933లో నాజీ పార్టీ నాయకుడు హిట్లర్​ జర్మనీ చాన్స్​లర్​ అయ్యాడు. దాంతో అడాల్ఫ్​కు, డసర్​ కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి.  కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం​ నాజీ పార్టీలో సభ్యులుగా అడాల్ఫ్​, రుడాల్ఫ్ చేరాల్సి వచ్చింది​. 1939లో రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. 1940లో అన్నదమ్ములిద్దరినీ మిలిటరీలో చేరమని ఆదేశాలందాయి. సైన్యానికి బూట్లు తయారుచేసే షరతుతో అన్నదమ్ములిద్దరినీ 1941 జనవరిలో వెనక్కి పంపారు. వీళ్లు ఆ పనిలో ఉండగానే1943లో రుడాల్ఫ్​ను మళ్లీ సైన్యంలోకి తీసుకెళ్లారు. కంపెనీ విషయాల్లో రుడాల్ఫ్​ భార్య ఫ్రీడెల్​ జోక్యం చేసుకుంటుండడంతో గొడవలు మొదలయ్యాయి. యుద్ధం ముగిశాక అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. అదే టైంలో డి–నాజిఫికేషన్​ కింద డసర్​ కంపెనీని అమెరికా సైన్యం మూసివేసింది. అన్నదమ్ములిద్దరినీ అరెస్టు చేసింది. చివరికి జర్మనీలోనే ఉంటున్న ఒక యూదు జాతి అధికారి జోక్యంతో వాళ్లను వదిలేసింది. అలాగే డసర్​ కంపెనీ తెరిచేందుకు ఒప్పుకొంది. 

అలా మొదలైంది 

డసర్​ కంపెనీ తిరిగి మొదలైనప్పటికీ అడాల్ఫ్​తో కలిసి ఉండేందుకు రుడాల్ఫ్​ ఇష్టపడలేదు. తన వాటా తీసుకొని ‘ప్యూమా’ పేరుతో సెపరేట్ కంపెనీ పెట్టాడు. డసర్​ కంపెనీ అడాల్ఫ్​కు దక్కింది. అప్పుడే కంపెనీ పేరును ‘అడిడాస్​’గా మార్చాడు​. రుడాల్ఫ్​ వెళ్లిపోయాక మార్కెటింగ్​ బాధ్యతలు కేథరిన్​ తీసుకుంది. భార్యాభర్తలిద్దరూ ‘అడిడాస్’ను మరింత డెవలప్​ చేశారు. బూట్లలో మార్పులు, చేర్పులు, కొత్త డిజైన్లు తెచ్చారు.1952 నుంచి బూట్లతోపాటు స్పోర్ట్స్​ డ్రస్​లు, ఇతర ప్రొడక్ట్స్​​ కూడా తయారుచేయడం మొదలుపెట్టారు. 1954లో స్విట్జర్లాండ్​లోని బెర్న్​లో జరిగిన ఫుట్​బాల్​ ప్రపంచకప్​ పోటీల్లో బలమైన హంగేరీ టీమ్​ను జర్మనీ ఓడించి కప్​ గెలుచుకుంది. ఫైనల్​లో జర్మనీ ఆటగాళ్ళు ‘అడిడాస్​’ స్నీకర్స్​ వేసుకొని ఆడారు. దాంతో మళ్ళీ ‘అడిడాస్’​ పేరు మార్మోగిపోయింది.

అడాల్ఫ్​, కేథరిన్​ ఇద్దరికీ స్పోర్ట్స్​పర్సన్స్​తో మంచి పరిచయాలు ఉండడం కూడా కలిసొచ్చింది. 1960 నుంచి మార్కెట్లో ‘అడిడాస్’ నెం.1గా మారింది. ఫ్యాక్టరీలు, పనిచేసేవాళ్ల సంఖ్య పెరిగింది. అయితే 1978లో అడాల్ఫ్​, 1984లో కేథరిన్, 1987లో కొడుకు హార్ట్సే చనిపోయారు. దాంతో కంపెనీ ఇబ్బందుల్లో పడింది. 1989లో ‘అడిడాస్’లో​ 80శాతం వాటాను ఫ్రెంచ్​ బిజినెస్​మ్యాన్​ బెర్నార్డ్​ తీసుకున్నాడు. ఆయన తన వాటాను రాబర్ట్ లూయిస్​ అనే మరొక బిజినెస్​మ్యాన్​కు 1993లో అమ్మాడు. అడిడాస్​కు రాబర్ట్​ మళ్ళీ పూర్వవైభవం తెచ్చాడు. కంపెనీలో అడాల్ఫ్​ కుటుంబసభ్యుల వాటాను కొనసాగిస్తూనే తిరిగి మార్కెట్లో నెం.2 పొజిషన్​కు తీసుకొచ్చాడు. పోటీ కంపెనీ రీబాక్​ను కూడా కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అడిడాస్​కు 1,190 స్టోర్లు ఉన్నాయి. సుమారు 60వేల మంది పనిచేస్తున్నారు. అడిడాస్​ బ్రాండ్​ విలువ 16.48 బిలియన్​ డాలర్లు (సుమారు 13లక్షల కోట్ల రూపాయలకుపైనే). 

‘అడిడాస్​’ షూ మాత్రమే వేసుకెళ్లాలి!

  • షూ, స్నీకర్​ మధ్య చిన్నపాటి తేడా ఉంది. కేవలం అథ్లెట్స్​​ కోసం మాత్రమే తయారుచేసినవి స్నీకర్స్​. ఎవరైనా వాడగలిగేలా తయారుచేసిన వాటిని షూ అంటారు.   
  • అమెరికాలోని బోస్టన్​లో ‘అడిడాస్​ పార్క్​’ ఉంది. ఇందులోకి ‘అడిడాస్​’ షూ, స్నీకర్స్​ వేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్లాలి. వేరేవి వేసుకున్న వాళ్లు వెళితే, వాటిని తీసేసి ‘ట్రీ ఆఫ్​ షేమ్​’ అనే చెట్టుకు తగిలిస్తారు పార్కులోని ‘అడిడాస్​’ అభిమానులు. ఆ చెట్టుకు ఎన్నో జతల నైక్​, ప్యూమా షూ కనిపిస్తాయి!
  • అడిడాస్​కు మూడు లోగోలు ఉన్నాయి. మొదటిది మూడు ఆకులు ఉన్న ‘ట్రెఫాయిల్​’. ఇందులోని ఆకులు కంపెనీ ప్రొడక్ట్స్​కు మార్కెట్లయిన ఉత్తర అమెరికా, యూరప్​, ఆసియాను సూచిస్తాయి. ఈ లోగోను​ 1972 మ్యూనిచ్​ ఒలింపిక్స్​తో మార్కెట్లోకి తెచ్చారు. 1990లో కొండ ఆకారంలోని మూడు గీతల లోగోను కంపెనీ తెచ్చింది. అడ్డంకులను అధిగమిస్తూ ఎదగాలని ఈ లోగో అర్థం. 2002లో తెచ్చిన లోగోలో ఒక సర్కిల్​ మీద మూడు గీతలు ఉంటాయి. దీన్ని అడిడాస్​ స్టైల్​ ప్రొడక్ట్స్​కు వాడుతున్నారు. 
  • అడిడాస్​ ప్రపంచంలోని ఎంతో ఫేమస్​ ఆటగాళ్లకు స్పాన్సరర్​గా ఉంది. ఇందులో మెస్సీ, జిదానె, ఆండీ ముర్రే, డేవిడ్​ బెక్​హామ్​ ఉన్నారు. అలాగే చాలా స్పోర్ట్స్​కు స్పాన్సర్​షిప్​గా కూడా ఇస్తోంది. అందులో అమెరికన్​ ఫుట్​బాల్​, ఆర్చరీ,​ జిమ్నాస్టిక్స్​, బేస్​బాల్​, బాస్కెట్​బాల్​, బాక్సింగ్​, ఫెన్సింగ్​, ఫీల్డ్​ హాకీ, గోల్ఫ్​, హ్యాండ్​బాల్​, ఐస్​ హాకీ, స్విమ్మింగ్​, టెన్నిస్​, ట్రాక్​ అండ్​ ఫీల్డ్​, వాలీబాల్​, రెజ్లింగ్​ ఉన్నాయి.