ఆదిలాబాద్లో ఖాళీ అవుతున్న కారు..కాంగ్రెస్​లోకి క్యూ

ఆదిలాబాద్లో ఖాళీ అవుతున్న కారు..కాంగ్రెస్​లోకి క్యూ
  • ఆదిలాబాద్​ జిల్లాలో పెద్ద ఎత్తున వలసలు
  •     లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరుస షాక్​లు
  •     తాజాగా హస్తం కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్, జైనథ్ జడ్పీటీసీ

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్​ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలోకి గులాబీ నేతలు క్యూ కడుతున్నారు. లోక్​సభ ఎన్నికలకు ముందు ఒక్కొక్కరుగా కేసీఆర్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్​పార్లమెంట్​స్థాయి సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్​నేతలు పార్టీ మారకుండా వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వలసలు ఆగడం లేదు. 

ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్ బీఆర్ఎస్​నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. ఈ నెల 3న మంత్రి సీతక్క సమక్షంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జైనథ్ జడ్పీటీసీ అరుంధతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, పూసాయి గ్రామ సర్పంచ్ అల్లూరి పోతారెడ్డితోపాటు పలువురు లీడర్లు హస్తం గూటికి చేరారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. 

లోక్​సభ ఎన్నికలే టార్గెట్

వలసలతో జిల్లాలో కాంగ్రెస్​ మరింత బలం పుంజుకుంటోంది. ఇతర పార్టీల్లోని జిల్లా స్థాయి నేతల నుంచి కిందిస్థాయి లీడర్లు వరకు రోజుకొకరు హస్తం కండువా కప్పుకుంటున్నారు. మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో.. కాంగ్రెస్​రాష్ట్ర నాయకత్వం అందరినీ స్వాగతిస్తోంది. పార్టీ బలోపేతం దిశగా పావులు కదుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్​చార్జి మంత్రిగా ఉన్న సీతక్క లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టీ రిజర్వ్ కావడం, అదే ఆదివాసీ వర్గానికి చెందిన మంత్రి సీతక్క జిల్లా ఇన్​చార్జిగా ఉండడం కాంగ్రెస్ కు కలిసిరానుంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవద్దనే ఉద్దేశంతో అధిష్టానం వలసలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. చేరికలతో ఆ పార్టీ లీడర్లలో జోష్​పెరుగుతోంది.

ఈ సీటు.. వెరీ హాటు..

ఆదిలాబాద్ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుతో ఆదిలాబాద్ పార్లమెంట్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బోథ్, ఆసిఫాబాద్ లో మొన్న బీఆర్ఎస్ గెలుపొందగా, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్, ముథోల్ నియోజకవర్గాల్లో బీజేపీ, ఖానాపూర్ లో కాంగ్రెస్ గెలిచింది. నాలుగు స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీకి గట్టి పోటీ తప్పేలా లేదు. రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ, పార్టీ క్యాడర్ అసంతృప్తిగానే ఉంది. ఇప్పటికే లీడర్లు పార్టీ మారుతుండడంతో లోక్​సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తిమీద సాములా మారాయి.

ఓ పక్క మీటింగ్.. మరో పక్క జంపింగ్

బీఆర్ఎస్ నేతలు ఓటమి పట్ల నిరాశకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో ముందకు సాగాలని ఆదిలాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో గత బుధవారం కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించి పార్లమెంట్​ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అయితే,  అదేరోజున గులాబీ నేతల జంపింగ్​మొదలైంది. రాథోడ్ జనార్దన్, భోజారెడ్డి మంత్రి సీతక్కను కలిశారు. వీరితోపాటు పలువురు జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.