మా భూములు మాకియ్యాలె..భూనిర్వాసితుల ఆందోళన

మా భూములు మాకియ్యాలె..భూనిర్వాసితుల ఆందోళన
  • మా భూములు మాకియ్యాలె..
  • ఆదిలాబాద్​ యాపల్​గూడ సిమెంట్ ​ఫ్యాక్టరీ భూనిర్వాసితుల ఆందోళన
  • ఫ్యాక్టరీ స్థలం దున్నేందుకు వెళ్లిన రైతులు, బీజేపీ లీడర్ల అరెస్ట్

ఆదిలాబాద్, వెలుగు :   ఆదిలాబాద్  మండలంలోని యాపల్ గూడ లో   రేణుక సిమెంట్  ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ  శనివారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు సేకరించిన భూమిని  దున్నేందుకు  రాంపూర్ గ్రామం నుంచి  బీజేపీ నేత సుహాసిని రెడ్డి  నిర్వాసితులతో కలిసి  ఎడ్లబండ్లపై వచ్చారు. యాపల్ గూడ  ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ  స్థలంలోకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకోవడంతో  తోపులాట జరిగింది. తమ భూములు తమకివ్వాలని లేదంటే  ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  దాదాపు గంటపాటు పోలీసులు, నిర్వాసితులకు వాగ్వాదం జరిగింది. నిర్వాసితులను అక్కడ్నుంచి తీసుకెళ్తుండగా కొందరు పోలీసు జీపుపై కూర్చొని నిరసన తెలిపారు.  కొంత మంది పురుగుల మందు డబ్బాలతో  రావడంతో పరిస్థితి అదుపుతప్పింది.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నాయకులు  సుహాసిని రెడ్డి, పాయల్ శరత్​, సంతోష్ తో పాటు నిర్వాసితులను అరెస్టు చేసి ఆదిలాబాద్ రూరల్, భీంపూర్ పోలీసు స్టేషన్లకు తరలించారు.  

రైతులపై దౌర్జన్యం సహించం : ఎంపీ సోయం

సిమెంట్ ఫ్యాక్టరీ భూముల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని  బీజేపీ సహించదని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు.  గతంలో కలెక్టర్ ఈ విషయమై రైతులకు సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని,  ఇప్పటి వరకు దానికి మోక్షం కలగలేదన్నారు. రైతుల జీవితాలతో ఆడుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న  వెంటనే ఫ్యాక్టరీ పనులను ప్రారంభించాలని,  లేదంటే రైతులకు భూములు తిరిగి ఇవ్వాలన్నారు.

రైతులను మోసం చేస్తున్నరు..

రైతులను మోసం చేసి తక్కువ ధరకే రేణుక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాకరీకి ఎమ్మెల్యే జోగు రామన్న భూములు ఇప్పించారని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. ఐదేండ్లైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడంతో భూములు దున్నేందుకు వెళ్లామన్నారు.