- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపినప్పుడే భూసార రక్షణతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధ్యమవుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జైనథ్ మండలం ఆడ గ్రామంలోని ఆర్గానిక్ ఎరువుల తయారీ కేంద్రాన్ని సందర్శించి, తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మితిమీరిన రసాయనాల వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా, పండించిన పంటలు ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయన్నారు.
ప్రకృతి సిద్ధంగా లభించే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా రైతులకు మేలు జరుగుతుందన్నారు. సేంద్రీయ ఎరువుల విశిష్టతను రైతులకు వివరించి, స్వయంగా తయారు చేసుకునేలా ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, మండల స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన
అనంతరం బోరజ్ మండలం పెండల్ వాడలోని రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ -రైతు అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉద్యానవన పంటల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావచ్చన్నారు. కాలానికి అనుగుణంగా రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
