ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మీడియా ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
