- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు : పేదల భూములను ఆక్రమించినా, తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇతరుల పేరిట అక్రమంగా బదిలీ అయిన భూములను స్వాధీనం చేసుకుని శుక్రవారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామానికి చెందిన అడ్డురి రమణబాయికి ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వే నంబర్ 83లో ఒక ఎకరం 15 గుంటల భూమి కేటాయించగా, ఆ భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడు.
కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు అక్రమ పట్టాను రద్దు చేసి తిరిగి అడ్డురి రమణబాయి పేరుపై పట్టా జారీ చేశారు. సిరికొండ మండలానికి చెందిన కుమరం జంగు బాపుకు చెందిన సర్వే నంబర్ 57/A/1లోని 6 ఎకరాలు 18 గుంటల భూమిని పలువురు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారు.
అక్రమ పట్టాను రద్దు చేసి తిరిగి కుమరం జంగు బాపుకు భూమి పట్టా అందించారు. ఈ సందర్భంగా అధికారులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బేల మండలంలోని భవానీగూడ గ్రామంలో పేదలకు కలెక్టర్ దుప్పట్లను పంపిణీ చేశారు. జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు పాల్గొన్నారు.
పదో తరగతి ఫలితాల్లో బేలను టాప్ లో నిలపాలి..
పదో తరగతి ఫలితాల్లో బేల పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాప్ లో నిలపాలని కలెక్టర్ రాజర్షి షా టీచర్లకు సూచించారు. శుక్రవారం బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ముందుగా దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను కలెక్టర్ ప్రారంభించి పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, హెచ్ఎం కొమ్ము కృష్ణ, ప్రజాప్రతినిధులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
