
- నిండుకుండలా ప్రాజెక్టులు, చెరువులు
- పెరిగిన భూగర్భ జలాలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మొదట్లో వర్షాలు ముఖం చాటేసినా మళ్లీ దంచికొట్టాయి. దీంతో ఈ ఏడాది ఆగస్టులో సాధారణం కంటే 50 శాతం అధికంగా వర్షం కురిసింది. జూన్, జూలైలో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఆగస్టులో మాత్రం సాధారణ కంటే ఏకంగా 50 శాతం అధికంగా నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 861.3 మిల్లీమీటర్లు కాగా ఆగస్టులో 1084.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వ్యత్సాసం 26 శాతం.
మొత్తంగా చూస్తే జిల్లాలో ఇప్పటి వరకు 23 శాతం అధికంగా వర్షం కురిసింది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూలై చివరి వరకు సైతం చెరువులు, ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో ఆగస్టులో దంచికొటిన వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగుతో పాటు చెరువులు, వాగులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. సెప్టెంబర్ లోనూ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
పెరిగిన భూగర్భ జలాలు
జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు కూడా పెరిగిపోయాయి. తక్కువ లోతులోనే భూగర్భ జలాలు ఉస్తున్నాయి. జులైలో 4 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఆగస్టులో 1.71 మీటర్ల లోతులోనే నీటి లభ్యత కనిపించింది. జులైతో పోల్చుకుంటే జిల్లాలో 2.30 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గాదిగూడ మండలంలోని అర్జునిలో ఓవర్ ఫ్లో ఉండటంతో 0.01 (పాయింట్) లోతులోనే జలాలు ఉబికి వస్తున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో మే నెలలో భూగర్భ జలాలు 10 మీటర్ల లోతుకు పడిపోయాయి. భారీగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. బావులు, బోరు బావుల్లో నీరు ఉబికి వస్తోంది.