
- పంట నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందించే పథకం
- రాష్ట్రంలో ఈ పథకాన్ని నిలిపివేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
- భారీ వర్షాలతో ఇటీవల జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంట నష్టం
- సర్కార్ ఆర్థిక సాయంపైనే రైతుల ఆశలు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా అధిక వర్షాలు, వరదలతో భారీగా పంట నష్టం జరుగుతోంది. ఇలా పంట నష్టపోయినప్పుడు పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం ఎంతో ఉపయోగడేది. కానీ తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు సర్వే చేసి నివేదికలు పంపుతున్నారు. గతేడాది సైతం పంపినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదు.
భారీ వర్షాల దెబ్బకు ఇసుక మేటలు, రాళ్లు, బురద దర్శనమిస్తున్న పంట పొలాలను చూసి రైతులు కన్నీరుమున్నీరవుతు న్నారు. మళ్లీ ఆ పొలాల్లో పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ వేసినా దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సర్వం కోల్పోయిన రైతులు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
2018-19లోనే నిలిపివేసిన బీఆర్ఎస్అ
ధిక, అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన సమయంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందేవారు. కానీ ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆ పార్టీ 2018–19లో పథకాన్ని నిలిపివేయడంతో వర్షాలతో నష్టపోయిన రైతులకు ధీమా లేకుండా పోయింది. గతంలో పత్తికి వాతావరణ ఆధారిత బీమాను, వరి, సోయ, పంటలకు గ్రామ యూనిట్ గా, ఇతర పంటలకు మండల యూనిట్ గా పథకాన్ని అమలు చేశారు. అతివృష్టి, అనావృష్టి సమయంలో నష్టపోయిన పంటలకు ఈ పథకం ద్వారా పరిహారం అందిస్తారు.
బీమా ప్రీమియంలో రైతులు 50 శాతం చెల్లిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం చొప్పను చెల్లించేది. కానీ ఈ పథకాన్ని కొన్నేళ్లుగా అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫసల్ బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ.. ఇంకా కార్యారూపం దాల్చలేదు. కానీ వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
20 వేల ఎకరాల్లో నష్టం
జిల్లాలో రైతులు 80 శాతం పత్తి సాగు చేస్తుస్తున్నారు. అయితే అధిక వర్షాల కారణంగా విత్తనాలు పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చేంతవరకు నష్టాలు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 5.80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశాది. పత్తి 4 లక్షల్లో ఎకరాల్లో సాగైంది. ఇటీవల కురిసిన వర్షాలకు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో 15 వేల ఎకరాలకు పైగా పత్తి పంట దెబ్బతిన్నది. పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలపై అధికారులు మరోసారి సర్వే చేయిస్తున్నారు.
ఆర్థిక సాయంపై ఆశలు
జిల్లాలో నష్టపోయిన పంటలను ఇటీవల పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 10 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్కారు అందించే సాయంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగు సమయంలో అప్పుల కోసం అవస్థలు పడ్డ రైతులు.. ఇప్పుడు వర్షాలకు పంటలు దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్త పంట సాగు చేసేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. పంట నష్టపోయిన రైతులు ఒకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం జరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఎకరానికి కనీసం రూ. 20 వేలు చెల్లించాలని కోరుతున్నారు.
నాలుగు ఎకరాల్లో నష్టం
ఇటీవల కురిసిన వర్షాలకు నాలుగు ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. చేనులో వరద ప్రవహించడంతో ఇసుక మేటలు వేసాయి. పంట ఎదిగే దశలో వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఏడాది ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టిన. ప్రభుత్వమే సాయం చేసి ఆదుకోవాలి. – పుదారి శేఖర్, రైతు అంకోలి