రోడ్డు ప్రమాదాల నివారణ కు ‘ఖాకీ కిడ్స్’ : ఎస్పీ అఖిల్ మహాజన్

రోడ్డు ప్రమాదాల నివారణ కు ‘ఖాకీ కిడ్స్’ :  ఎస్పీ అఖిల్ మహాజన్
  •     ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మొదటిసారిగా ‘ఖాకీ కిడ్స్’ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆదిలాబాద్​ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలు ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్ల విద్యార్థులు ‘ఖాకీ కిడ్స్’గా మారనున్నట్లు తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్కో కానిస్టేబుల్​ను ఎంపిక చేసి వారంలో మూడు స్కూళ్లను సందర్శించి విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి, వారిని ‘ఖాకీ కిడ్స్’గా మార్చనున్నట్లు పేర్కొన్నారు. అవగాహన పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా పోలీసు శాఖ తరఫున ఒక బ్యాడ్జిను అందజేస్తామన్నారు. 

బైక్​లు నడిపేవారు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, ట్రిపుల్ రైడింగ్, కార్లలో సీట్ బెల్ట్, ర్యాష్ డ్రైవింగ్ జరగకుండా ప్రోత్సహించి ప్రమాదాలను అరికట్టేలా తమ వంతు పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.మౌనిక, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, స్వామి, ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు మురళి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.