- బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీకి చెక్
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడంలో కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకుంది. ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ బండారి అనూషకు చైర్‌పర్సన్ పదవి దక్కింది. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ అధ్యక్షతన మీటింగ్ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం బీజేపీ తరఫున చైర్‌పర్సన్ క్యాండిడేట్‌గా జోగు శైలజ పేరును ఎంపీ గొడం నగేశ్ ప్రతిపాదించగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ బలపర్చారు. అలాగే 45వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన బండారి అనూషను చైర్‌పర్సన్ క్యాండిడేట్‌గా కాంగ్రెస్ బలపర్చింది. ఓటింగ్‌లో అనూషకు మద్దతుగా కాంగ్రెస్‌కు చెందిన 11 మందితో పాటు ఐదుగురు బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 27 మంది ఓటు వేశారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థికి రెండు ఎక్స్‌అఫీషియో ఓట్లు కలుపుకొని 23 ఓట్లు వచ్చాయి. దీంతో బండారి అనూష చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం వైస్‌చైర్మన్‌గా ఎఐంఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్‌ను ఎన్నుకున్నారు. వీరితో అడిషనల్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్
మున్సిపాలిటీలో 21 స్థానాలు గెలిచిన బీజేపీకి ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లు కలిపి మొత్తం 23 ఓట్లు ఉన్నాయి. బీజేపీ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలవడంతో బీజేపీకి పదవి దూరమైంది. సోమవారం ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు అంతా ఒకే ఆఫీస్‌లో మున్సిపల్ ఆఫీస్‌కు చేరుకోవడంతో చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ దక్కుతుందని తేలిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నికలో.. బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు ఏకం కావడంతో ఇండిపెండెంట్ కౌన్సిలర్ అనూషను చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. మొదటిసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఒకే క్యాండిడేట్‌కు మద్దతు ఇవ్వడం విశేషం.
కాంగ్రెస్ లో చేరిన మన్సిపల్ చైర్‌పర్సన్
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం నిజామాబాద్‌లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కలిశారు. ఆయన ముందుగా అనూషసతీశ్‌ను శాలువాతో సత్కరించిన అనంతరం కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
