ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ గౌస్​ ఆలం

ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ గౌస్​ ఆలం

ఆదిలాబాద్​టౌన్/బాసర, వెలుగు: ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ​ఎస్పీ గౌస్​ ఆలం హెచ్చరించారు. గురువారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ర్యాగింగ్​కు పాల్పడకుండా కాలేజీల యాజమాన్యాలు, లెక్చరర్లు చూసుకోవాలన్నారు. కాలేజీలు, స్కూళ్లలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ర్యాగింగ్​కు దూరంగా ఉండాలి

విద్యార్థులు ర్యాగింగ్​కు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించాలని భైంసా ఏఎస్పీ అవినాశ్​ కుమార్​అన్నారు. ‘నిర్మల్ పోలీసు-- మీ పోలీసు’ కార్యక్రమంలో భాగంగా గురువారం బాసర ట్రిపుల్​ఐటీలో ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ర్యాగింగ్​ చట్టవిరుద్దమన్నారు. ర్యాగింగ్​కు పాల్పడితే ​కేసుల పాలై భవిష్యత్​లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరని హెచ్చరించారు.

తోటి విద్యార్థులతో స్నేహాపూర్వకంగా మెలగాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. ఎవరైన ర్యాగింగ్​కు పాల్పడితే 100కు కాల్​ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేశ్, ఎస్సైలు గణేశ్​, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.