వాడీవేడిగా ఆదిలాబాద్​ జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్

వాడీవేడిగా ఆదిలాబాద్​ జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్

ఆదిలాబాద్,వెలుగు: ఏసీడీ బిల్లులు వసూలు చేస్తూ ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటోందని పలువురు జడ్పీటీసీలు ఆరోపించారు. చైర్మన్​ జనార్దన్​ రాథోడ్​ అధ్యక్షతన జరిగిన జడ్పీ మీటింగ్​లో పలువురు సభ్యులు విద్యుత్​ చార్జీలపై మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని చార్జీలు పెంచుతోందని, విద్యుత్ ఏసీడీ చార్జీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తలమడుగు జడ్పీటీసీ గోక గణేశ్​​ రెడ్డి డిమాండ్​ చేశారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం రబీ పంటల వేసుకుంటున్న టైమ్​లో కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. కరెంట్ సరఫరా చేయాలని రైతులు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని బజార్​హత్నూర్ జడ్పీటీసీ నర్సయ్య ఫైర్​అయ్యారు. ఉట్నూర్​ మండలంలోని 70 మంది రైతులు త్రీఫేజ్​ కోసం రూ. 6  వేల చొప్పున డీడీ కట్టారని, అయినా ఇంత వరకు త్రీఫేజ్ కరెంట్​ సరఫరా కాలేదని ఎంపీపీ జైవంత్ రావు పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాలు, టాయిలెట్ల పనుల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని సభ్యులు చెప్పారు.కేజీబీవీల్లో టాయిలెట్లు లేక విద్యార్థిణులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. స్వచ్ఛ భారత్ టాయిలెట్ల బిల్లులు రాలేదని తెలిపారు.

దళితబంధుకు కమీషన్ అడుగుతున్రు..

దళిత బంధు పథకంలో అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రూ. 2 లక్షలు కమీషన్ అడుగుతున్నారని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు. దళిత బంధు వచ్చిన వారు.. రానివారితో కలిసి పంచుకోవాలని ఎమ్మెల్యే రేఖా నాయక్ బహిరంగంగా చెబుతున్నారని ఉట్నూర్ జడ్పీటీసీ చారులత ఆరోపించారు. దళితబంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. జందాపూర్ నుంచి కరంజీ వరకు మంజూరైన రోడ్డు పనులు చేపట్టడంలో ఆర్అండ్​బీ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఆర్ అండ్ ​బీ ఈఈ నర్సయ్య సరైన సమాధానం చెప్పకపోవడంతో పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.ఉట్నూర్ హాస్పిటల్ లో డాక్టర్లు ఉండడం లేదన్నారు. జడ్పీ చైర్మన్​ రాథోడ్​ జనార్దన్ ​మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర సిక్తా పట్నాయక్ ​మాట్లాడుతూ కేజీబీవీ, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మండల సర్వసభ్య సమావేశాలకు డివిజన్​స్థాయి ఆఫీసర్లు హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్​ హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.