సూర్యుడు వైపు దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1 : నాలుగు నెలల టైం.. 15 లక్షల కిలోమీటర్ల జర్నీ

సూర్యుడు వైపు దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1 : నాలుగు నెలల టైం.. 15 లక్షల కిలోమీటర్ల జర్నీ

చంద్రయాన్‌ 3 విజయంతో ఫుల్ జోష్‌ మీదున్న ఇస్రో మరో కొత్త మిషన్ ను ప్రయోగించింది.  సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ‘ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహం  నెల్లూరులోని షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. సెప్టెంబరు 2  ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని ‘పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్  గగనతంలోకి విజయవంతంగా  దూసుకెళ్లింది. 

ఎన్ని రోజుల ప్రయాణం..

ఆదిత్య ఎల్ 1 ఉప గ్రహం భూమి నుంచి సూర్యుడి దిశగా దాదాపు 15 లక్షల కి.మీల దూరంలో ఉన్న లాగ్‌రేంజ్‌ 1  ప్రాంతానికి చేరుకుంటుంది. ఇందుకు 125 రోజుల సమయం పడుతుంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమేనని ఇస్రో వెల్లడించింది. 

పీఎస్‌ఎల్‌వీలో పీఎస్‌ఎల్‌వీ సీ 57 రాకెట్ అత్యంత శక్తిమంతమైనది.  2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్  లో  ఈ రకం రాకెట్‌లనే వినియోగించారు. ‘ఆదిత్య-ఎల్ 1’ ఉప గ్రహాన్ని మొదటగా దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్‌1 పాయింట్‌ వైపు మళ్లిస్తారు. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం నుంచి బయటపడి, చివరికి ఎల్‌1 చుట్టూ కక్ష్యలోకి ఆదిత్య  రాకెట్ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సూర్యుడి రహస్యాలను ఈ మిషన్ ఛేదిస్తుంది. 

ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. ఇందులో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (VELC) అత్యంత కీలకం.  ఇది సూర్యుడికి సంబంధించి  ఒక్కో నిమిషానికి సంబంధించి ఒక్కో ఫొటోను  రోజుకు 1440 ఫొటోలను ఇస్రోకు పంపనుంది. దీంతో పాటు సోలార్‌ అల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటో మీటర్‌ పేలోడ్‌లను ఈ రాకెట్ కు  అమర్చారు. ఇది  సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ వంటి అనేక విషయాలను అధ్యయనం  చేస్తుంది.