
యాదాద్రి, వెలుగు: ఎస్జీటీల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కానుంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందిన వారిలో కొందరు నాట్ విల్లింగ్అంటూ పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆగిపోయింది. గత నెలలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు పొందిన స్కూల్ అసిస్టెంట్లలో 16 మంది మల్టీ జోన్-1 పరిధిలోని స్కూల్స్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి.
ఖాళీగా ఉన్న 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చి గత నెల 26 లోగా భర్తీ చేయాల్సిఉండగా.. స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందిన టీచర్లు ఈ నెల 15లోగా ఆయా స్కూల్స్లో చేరాల్సి ఉంది. అయితే ప్రమోషన్ పొందిన వారిలో 70 మంది విధుల్లో చేరగా 26 మంది ఎస్జీటీలు ప్రమోషన్ వద్దనుకున్నారు. నలుగురి ప్రమోషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రమోషన్లు వద్దనుకుంటున్న టీచర్లు ఆలస్యంగా తెలియిజేయడం వల్ల ఎస్జీటీల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యమైంది. ఆదివారం నుంచి దసరా సెలవులు ప్రకటించారు. దీంతో 70 మంది ఎస్జీటీల సర్దుబాటు ప్రక్రియను ఆఫీసర్లు ఆపేశారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత తిరిగి సర్దుబాటు చేపట్టనున్నారు.