తుమ్మిడిహెట్టి– సుందిళ్ల లింక్ కు డీపీఆర్! .. హైడ్రాలజీ లెక్కలు తేల్చాక మహారాష్ట్రతో చర్చలు

తుమ్మిడిహెట్టి– సుందిళ్ల  లింక్ కు డీపీఆర్! .. హైడ్రాలజీ లెక్కలు తేల్చాక మహారాష్ట్రతో చర్చలు
  • రిపోర్ట్ తయారీకి రూ.11.88 కోట్లతో పరిపాలనా అనుమతులు
  • ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసేందుకు వేగంగా సర్కారు అడుగులు 

తుమ్మిడిహెట్టి–సుందిళ్ల లింక్​కు ప్రభుత్వం డీపీఆర్​ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. రిపోర్ట్ తయారీకి రూ.11.88 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది

హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత నదీ జలాలను వాడుకునేందుకు రాష్ట్ర సర్కారు వేగంగా అడుగులు వేస్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తరలించాలని ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించినా.. ఆ బ్యారేజీ నుంచి తరలించే నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించేలా లింక్​ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి–సుందిళ్ల లింక్​కు ప్రభుత్వం డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్​)ను తయారు చేసేందుకు కసరత్తులను ముమ్మరం చేసింది. తుమ్మిడిహెట్టి–సుందిళ్ల లింక్​ కు డీపీఆర్ తయారీకి ప్రభుత్వం శనివారం టెండర్లను ఆహ్వానించింది.

ఇందుకోసం రూ.11.88 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. డీపీఆర్​లో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు ఇన్వెస్టిగేషన్లు, నీటి లభ్యత, నేల పరిస్థితులు, ఇప్పటికే మైలారం వరకు ఉన్న కాల్వల నెట్​వర్క్ స్థితిగతులు, పర్యావరణ, ఇతర అనుమతులనూ తీసుకునేలా సంస్థల నుంచి టెండర్లను పిలిచింది.  

ఇదీ ప్రాజెక్ట్ స్వరూపం.. 

ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు 116 కిలోమీటర్లు కాగా, ఆ పనులను గతంలో 5 ప్యాకేజీలుగా విభజించారు. అందులో ప్యాకేజీ 3 పూర్తిగా బ్యారేజీ నిర్మాణం. ఇక ప్యాకేజీ 1లో-15 కిలోమీటర్ల వరకు కాలువ, ప్యాకేజీ2లో 15.28 కిలోమీటర్ల కాలువ, ప్యాకేజీ 4లో 28.5 నుంచి 71.5 కిలోమీటర్ల మేర మైలారం వరకు కాంక్రీట్‌‌ లైనింగ్‌‌ లేని కాలువ తవ్వకం పనులున్నాయి. 

ఇక అత్యంత కీలకమైన ప్యాకేజీ 5లో  44.50 కిలోమీటర్ల మేర ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే సిస్టమ్స్​ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, ఆ సిస్టమ్​లో ఒక లిఫ్ట్​ను నిర్మించాల్సి రావడం.. వ్యయ భారం అవుతుండడంతో దానిని పక్కన పెట్టాలని సర్కారు భావించింది. అందుకు సరిపోయే ప్లాన్​తో ముందుకు రావాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. 

రెండు ఆప్షన్లపై రిపోర్టులు తీసుకురావాలని సూచించింది. దీంతో మైలారం నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు బదులుగా.. మైలారం నుంచి సుందిళ్లకు తరలిస్తే అదనంగా లిఫ్ట్ నిర్మాణం అవసరం ఉండదని అధికారులు సూచించారు. పైగా దూరం కూడా తగ్గుతుందని, పంప్​హౌస్​ల అవసరం ఉండదని, గ్రావిటీ ద్వారానే నీటిని తీసుకోవచ్చని సిఫార్సు చేశారు. 

దీంతో తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల లింక్​కే ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. వీలైనంత త్వరగా రివైజ్డ్ డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరిగేషన్​ అధికారులు డీపీఆర్ యారీకి జీవోను జారీ చేశారు.

నీటి లభ్యతపై స్టడీ తర్వాతే మహారాష్ట్రతో చర్చలు..  

డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చినా ఎంత ఎత్తుతో బ్యారేజీని నిర్మిస్తారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. బ్యారేజీ ఎత్తుపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో మన సర్కారు సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదించినప్పటికీ.. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. తమ భూభాగంలోని భూములు ముంపుకు గురవుతాయని, ఆ ఎత్తుకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. 

148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు ఒప్పుకుంటామని చెప్పినా.. ఆ ఎత్తులో మనకు కావాల్సిన160 టీఎంసీలు అందవన్నది మన ప్రభుత్వ అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని కట్టేలా మహారాష్ట్రను ఒప్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. 

ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోని పక్షంలో 150 మీటర్ల ఎత్తుతోనైనా నిర్మించుకునేలా అనుమతులు తెచ్చుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నది. అయితే, మహారాష్ట్రతో చర్చలు ఎప్పుడనేది స్పష్టంగా చెప్పకపోయినా.. త్వరలోనే మరోసారి హైడ్రాలజీ (నీటి లభ్యత) లెక్కలపై అధ్యయనం చేయించాక ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలిసింది.