కొత్త రూల్..పాలిసెట్ తోనే అగ్రికల్చర్ డిప్లొమా

కొత్త రూల్..పాలిసెట్ తోనే అగ్రికల్చర్ డిప్లొమా

టెన్త్‌‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా అగ్రికల్చర్ డిప్లొమా చేద్దామంటే ఇక కుదరదు. ఇప్పటివరకు కేవలం టెన్త్ స్కోరు ఆధారంగా సీట్లు ఇచ్చే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నిర్వహించే పాలిసెట్ ఎగ్జామ్ రాస్తే అందులో వచ్చిన ర్యాంకు ఆధారంగానే అగ్రికల్చర్ డిప్లొమా, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్‌‌‌‌లో అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ తెలంగాణ స్టేట్‌‌ అగ్రికల్చరల్‌‌ యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లోని సీట్లను ఇకనుంచి పాలిసెట్‌‌ ప్రాతిపదికగా కేటాయిస్తారు. దీంతో పాటు ఈ ఏడాది పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో ఎన్‍జీ రంగా అగ్రికల్చరల్‍ యూనివర్శిటీ ఉండేది. 2014 జులై 31న ఒక జీవో ద్వారా ప్రముఖ విద్యావేత్త, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్‍ జయశంకర్‍ పేరు మీదుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‍ఏయూ) ను ఏర్పాటు చేశారు. ఇది అగ్రికల్చర్‍లో పాలిటెక్నిక్‍, యూజీ, పీజీ కోర్సులను ఆఫర్‍ చేస్తోంది. వ్యవసాయ కోర్సులను అందించడంతో పాటు పరిశోధనలు చేస్తుంది. దీని కింద ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా 16 పాలిటెక్నిక్‍ కాలేజీలున్నాయి.

ఇంజినీరింగ్,నాన్ ఇంజినీరింగ్

ఇంటర్​, ఆపై నాలుగేళ్ల బీటెక్, బీఈ, బీఆర్క్, బీప్లానింగ్ చదవలేని వారు ఇంజినీర్​ అవడానికి వీలు కల్పిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలే పాలిటెక్నిక్​ డిప్లొమాలు. ఫుల్​టైమ్​ డిగ్రీ కోర్సులకు ఆల్టర్నేటివ్‌‌గా, జాబ్ ఓరియంటెడ్ కోర్సులుగా వీటిని చెప్పుకోవచ్చు. జాబ్ సాధించడానికి అవసరమైన థియరీ, ప్రాక్టికల్​ ట్రైనింగ్​, ఇతర స్కిల్స్​ నేర్పించడంతో కెరీర్‌‌‌‌లో తొందరగా సెటిలయ్యే అవకాశం దక్కుతుంది.

అడ్మిషన్లు ఇలా..

మన రాష్ర్టంలో స్టేట్​ బోర్డ్​ ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ ట్రైనింగ్​ (ఎస్​బీటీఈటీ) దాదాపు 38 ఇంజినీరింగ్​ డిప్లొమా కోర్సులను ఆఫర్​ చేస్తోంది. పాలిటెక్నిక్​ కామన్ ఎంట్రన్స్​ టెస్ట్ (పాలీసెట్​)​ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు  కల్పిస్తోంది. టెన్త్ పూర్తయిన వారు, ఈ ఏడాది పరీక్షలు రాస్తున్నవారు ఈ ఎంట్రన్స్ రాయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలు అన్నీ కలిపి రాష్ర్టంలో దాదాపు 260 పాలిటెక్నిక్​ కాలేజీలున్నాయి. వీటిలో 40 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

కోర్సులు

సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, మైనింగ్, హోం సైన్స్, మెటల్జరికల్, కెమికల్, బయో మెడికల్ ఇంజినీరింగ్‌‌తో పాటు ప్రింటింగ్, ప్యాకేజింగ్, గార్మెంట్, లెదర్, ఫుట్‌‌వేర్, టెక్స్‌‌టైల్ టెక్నాలజీలో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కెమికల్ ఇంజినీరింగ్ ఆయిల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్ & పాలిమర్స్, సెరామిక్ టెక్నాలజీ, టెక్స్‌‌టైల్ టెక్నాలజీలో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా కోర్సులతో పాటు 6 నెలలపాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది.

ఎగ్జామ్ ప్యాటర్న్

పదోతరగతి సిలబస్‌‌తోనే పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రెండున్నర గంటల సమయం ఇస్తారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు రాసే విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాస్తే సరిపోతుంది. వారికి బయాలజీ ప్రశ్నలు ఆప్షనల్ మాత్రమే.

ప్రైవేటు, గవర్నమెంట్ సెక్టార్లలో..

డిప్లొమా పూర్తయినవారు వివిధ కంపెనీలు, ఇండస్ర్టీల్లో అప్రెంటీస్​ చేయెచ్చు. ఆయా కంపెనీలు అప్రెంటీస్​ పూర్తి చేసిన వారికి ఫుల్​టైమ్​ జాబ్​లు కల్పిస్తాయి. టాప్ కంపెనీలూ జూనియర్ లేదా ఎంట్రీ లెవెల్లో అప్రెంటీస్​ చేసిన డిప్లొమా అభ్యర్థులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. సాధారణంగా ఈ అప్రెంటీస్​ ఒక ఏడాది ఉంటుంది. ఈ సమయంలో వారికి స్టైపెండ్​ కూడా చెల్లిస్తారు. బీహెచ్‍ఈఎల్‍, బీఈఎల్‍, ఐవోసీఎల్‍, బీపీసీఎల్‍, హెచ్‍పీసీఎల్‍, సెయిల్‍, గెయిల్‍, ఎన్‍ఎండీసీ, ఎన్‍ఎఫ్‍సీ, కొచ్చిన షిప్​యార్డ్​, పవన్‌‌హాన్స్​ లిమిటెడ్, బీఈసీఐఎల్​, డీఆర్‌‌‌‌డీవో వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఆర్‍టీసీ వంటి రాష్ర్ట ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేటు సెక్టార్​లో అటోమొబైల్, ఎలక్ర్టానిక్స్​, కంప్యూటర్​ ఇంజినీరింగ్​, కమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​, ఫుడ్​ ప్రాసెసింగ్​, అగ్రికల్చర్, ప్రింటింగ్​ అండ్​ పబ్లిషింగ్, కన్‌‌స్ర్టక్షన్, ఫెర్టిలైజర్స్​ వంటి కంపెనీలు డిప్లొమా అభ్యర్థులను అధికంగా నియమించుకుంటాయి.

లేటరల్ ఎంట్రీతో బీటెక్

ఇంజినీరింగ్​ కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (ఈసెట్) రాసి లేటరల్​ ఎంట్రీ విధానంలో బీటెక్​ రెండో సంవత్సరంలో ప్రవేశించవచ్చు. డిప్లొమాను ఇంటర్‌‌‌‌కు ఈక్వల్​ క్వాలిఫికేషన్​గా పరిగణిస్తారు కాబట్టి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చదవొచ్చు. కొన్ని రాష్ర్టాలు ఐటీఐ విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్​లు నిర్వహించి లేటరల్​ ఎంట్రీ ద్వారా నేరుగా పాలిటెక్నిక్​ డిప్లొమా రెండో ఏడాదిలో అడ్మిషన్లు కల్పిస్తుండగా వీరికి బీటెక్​ చేసే అవకాశమూ లభిస్తుంది.

డిప్లొమా కోర్సులు

పీజేటీఎస్‍ఏయూ రెండేళ్ల వ్యవధి ఉన్న అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ వంటి 3 పాలిటెక్నిక్‍ కోర్సులతో పాటు మూడేండ్ల వ్యవధి ఉన్న అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సును ఆఫర్‍ చేస్తోంది. ఇంతకుముందు ఈ కోర్సుల్లో కేవలం పదోతరగతిలో సాధించిన మెరిట్‍ ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు. ఇందులో చేరాలంటే ఒకటి నుంచి పదో తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంత (నాన్‍–మునిసిపల్‍ ఏరియా) పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సులకు అనర్హులు. 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ సంవత్సరం పదోతరగతి పరీక్షలు రాయబోతున్న స్టూడెంట్స్ సైతం అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో 620 సీట్లు, సీడ్ టెక్నాలజీలో 80 సీట్లు, ఆర్గానిక్ అగ్రికల్చర్‌‌‌‌లో 60 సీట్లు, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌‌లో 110 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎగ్జామ్ ప్యాటర్న్

పదోతరగతి సిలబస్‌‌తోనే పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు బయాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రెండున్నర గంటల సమయం ఇస్తారు. అగ్రికల్చర్ డిప్లొమాలో చేరేందుకు రాసే స్టూడెంట్స్ తప్పనిసరిగా బయాలజీ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులకు మాత్రం మ్యాథ్స్ 60/2=30 మార్కులు; ఫిజిక్స్ 30 మార్కులు, కెమిస్ట్రీ 30 మార్కులు, బయాలజీ 30 మార్కులు  మొత్తం 120 మార్కులకు సాధించిన స్కోర్ ఆధారంగా ర్యాంకు ఇస్తారు.

నోటిఫికేషన్

ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సులతోపాటు, అగ్రికల్చర్ డిప్లొమాలో అడ్మిషన్లు కల్పించేందుకు స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలిసెట్-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తు చేసుకునేందుకు దగ్గర్లోని టీఎస్‌‌ ఆన్‌‌లైన్‌‌/ హెల్ప్‌‌లైన్‌‌ సెంటర్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సులతో పాటు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు

అర్హత: పదోతరగతి పూర్తయిన వారు, ఈ ఏడాది పది పరీక్షలు రాస్తున్నవారు అర్హులే.

సెలక్షన్ ప్రాసెస్:కామన్ ఎంట్రన్స్ టెస్ట్

ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.400, ఎస్‌‌సీ, ఎస్‌‌టీ వారికి రూ.250.

దరఖాస్తుకు చివరి తేదీ:మే 31, 2020

పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది.

వెబ్‌‌సైట్: www.polycetts.nic.in

 

పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్‌ టెక్నాలజీ