ముగ్గురి డీఎన్ఏతో ముద్దుల పిల్లలు.. బ్రిటన్లో ‘త్రీ పేరెంట్ ఐవీఎఫ్’ సక్సెస్.. పుట్టుకతో వచ్చే పలు జన్యు వ్యాధులకు ఇక చెక్

ముగ్గురి డీఎన్ఏతో ముద్దుల పిల్లలు..  బ్రిటన్లో ‘త్రీ పేరెంట్ ఐవీఎఫ్’ సక్సెస్.. పుట్టుకతో వచ్చే పలు జన్యు వ్యాధులకు ఇక చెక్
  • రెండేండ్లలో 8 మంది జననం 
  •     పేరెంట్స్​తోపాటు మరో మహిళ డీఎన్ఏతో ఐవీఎఫ్ చికిత్స 
  •     పుట్టుకతో వచ్చే పలు జన్యు వ్యాధులకు ఇక చెక్


లండన్: బ్రిటన్​లో ముగ్గురి డీఎన్ఏతో 8 మంది ముద్దుల పిల్లలు జన్మించారు. తల్లి, తండ్రి డీఎన్ఏతోపాటు మరో మహిళ డీఎన్ఏను కూడా పుణికి పుచ్చుకుని ఈ బుడతలు జన్మిస్తున్నారు. ‘త్రీ పేరెంట్ ఐవీఎఫ్’ అనే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్​ను ఇంగ్లాండ్​లోని న్యూక్యాజిల్ వర్సిటీ సైంటిస్టులు విజయవంతంగా పూర్తిచేశారు. రెండేండ్ల కిందటే దీనిని ప్రారంభించగా.. ఏడుగురు మహిళలు 8 మంది శిశువులకు జన్మనిచ్చారు.

ముగ్గురి డీఎన్ఏతో ఎందుకంటే.. 

సాధారణంగా మన శరీర కణాల్లో కేంద్రకంతోపాటు మైటోకాండ్రియాల్లో కూడా డీఎన్ఏ ఉంటుంది. కేంద్రకంలోని న్యూక్లియస్ డీఎన్ఏతోపాటు మైటోకాండ్రియాలోని మైటోకాండ్రియల్ డీఎన్ఏ కూడా బాగుంటేనే పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధుల ముప్పు తప్పుతుంది. శరీర కణాలకు ఎనర్జీ ఫ్యాక్టరీలుగా పని చేసే మైటోకాండ్రియాల్లోని డీఎన్ఏలో మ్యుటేషన్లు జరిగితే.. అలాంటి మహిళలకు పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అంధత్వం, డయాబెటిస్, కండరాల క్షీణత, ఇతర జన్యు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ముప్పు తప్పించి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టేలా 
చేసేందుకే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఇలా చేశారు.. 

క్లినికల్ ట్రయల్స్​లో భాగంగా 22 మంది మహిళలకు న్యూక్యాజిల్ ఫర్టిలిటీ సెంటర్​లో రెండేండ్ల కిందట ట్రీట్మెంట్ షురూ చేశారు. వీరిలో మ్యుటేషన్లు తీవ్రంగా ఉన్న ఏడుగురు మహిళలను ఎంపిక చేశారు. ఒక మహిళ నుంచి అండం సేకరించి, ఆమె జీవిత భాగస్వామి వీర్య కణంతో ఫలదీకరణం చెందించారు. తర్వాత మైటోకాండ్రియల్ డీఎన్ఏలో మ్యుటేషన్లు లేని మహిళా దాత నుంచి కూడా అండం సేకరించి సంబంధిత పురుషుడి వీర్య కణంతోనే ఫలదీకరణం చెందించారు. అనంతరం డోనర్ ఎగ్​లో నుంచి న్యూక్లియస్ డీఎన్ఏను తొలగించి, సంతానం పొందాలనుకున్న మహిళ అండంలోని న్యూక్లియస్ డీఎన్ఏను రీప్లేస్ చేశారు. దీంతో తల్లి, తండ్రి న్యూక్లియస్ డీఎన్ఏతోపాటు దాత మైటోకాండ్రియల్ డీఎన్ఏతో శిశువు జన్మించింది.