పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాకెట్లు, సుతిల్ బాంబులు, చిచ్చు బుడ్లు కాలుస్తుంటే భలే అనిపిస్తుంది. కానీ, అవి కాల్చేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే పిల్లలు, పెద్దలు పటా కులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  •   పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన నిలబడి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంటుంది.
  •   పటాకులు కాల్చేటప్పుడు కాటన్‌ డ్రెస్‌లనే వేసుకోవాలి. దీపాలకు దూరంగా నిలబడాలి.
  •   గడ్డివాములు, పశువుల పాకలు, గుడిసెలు, పెట్రోల్‌ బంక్‌ల దగ్గర పటాకులు కాల్చొద్దు.
  •   వెలిగించాక కాలని వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నం చేయొద్దు. ఒక్కోసారి అవి చేతిలోకి తీసుకోగానే పేలే ప్రమాదం ఉంది.
  •   నీళ్ల బకెట్‌ పక్కన పెట్టుకోవాలి. చెప్పులు వేసుకునే బాంబులు కాల్చాలి.
  •   బాంబులు కాల్చేటప్పుడు, కాల్చిన తర్వాత చేతులను నోట్లో, ముక్కుల్లో పెట్టుకోవద్దు.
  •   అగ్గిపుల్లలకి బదులు కొవ్వొత్తులు, అగర బత్తులతో పటాకులు వెలిగించాలి.
  •   సర్టిఫైడ్‌ షాపులనుంచే పటాకులు కొనాలి. గ్యాస్‌ స్టవ్‌, కిరోసిన్‌ పొయ్యిల దగ్గర వాటిని పెట్టకూడదు. జేబుల్లో పటాకులు పెట్టుకొని తిరగొద్దు.
  •   పండుగ రోజు మట్టి దీపాలతో పాటు, రంగు రంగుల లైట్లతో ఇంటిని అలంకరిస్తారు. కాబట్టి, అలంకరించే లైట్ల వైర్లు సరిగా ఉన్నాయా లేదా చెక్‌ చేసుకోవాలి.
  •   బట్టలపై నిప్పురవ్వలు పడితే అవి రాజుకోకుండా వెంటనే ఒంటిపై దుప్పటి కప్పాలి. లేదా నేలపై అటుఇటు దొర్లించాలి.