
- ముంబైలో అత్యధిక ధరలు
- కోల్‌కతా మార్కెట్ అత్యంత చవక
- వెల్లడించిన జేఎల్ఎల్ ఇండియా
న్యూఢిల్లీ : తనఖా ఆస్తుల వడ్డీరేట్ల పెరుగుదల కారణంగా ఈ ఏడాది ఏడు ముఖ్య నగరాల్లో హౌసింగ్ ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి అఫోర్డబిలిటీ లెవెల్ (స్థోమత స్థాయి) తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ముంబై మినహా అన్ని ఏడు నగరాల్లో అఫర్డబిలిటీ ఇండెక్స్ మాత్రం అందుబాటులోనే ఉంది. కోల్‌కతా, పూణె, హైదరాబాద్‌లు అత్యంత చవకైన నివాస మార్కెట్లుగా మారుతాయని ఈ కన్సల్టెంట్ తన 'హోమ్ పర్చేజ్ అఫర్డబిలిటీ ఇండెక్స్' (హెచ్‌పీఏఐ)లో పేర్కొంది. ఏడాదిలో ఒక కుటుంబం సంపాదించే ఆదాయం (మొత్తం నగర స్థాయిలో) ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం హౌసింగ్ లోన్‌కు అర్హత పొందుతుందా లేదా ? అనే విషయాన్ని ఇండెక్స్ చెబుతుంది. హోంలోన్ వడ్డీ రేట్లు, సగటు కుటుంబ ఆదాయం, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ధర వంటి వాటిని లెక్కించి ఈ సూచికను రూపొందించారు. సగటు కుటుంబ ఆదాయం, అర్హత కలిగిన కుటుంబ ఆదాయం నిష్పత్తిని హెచ్‌పీఏఐ సూచిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 1,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌పై హోంలోన్ కోసం అర్హత సాధించడానికి ఒక కుటుంబం సంపాదించాల్సిన కనీస మొత్తాన్ని ‘అర్హత గల కుటుంబ ఆదాయం’గా పేర్కొన్నారు. 100 విలువ అంటే ఒక కుటుంబానికి లోన్ పొందేందుకు సరిపోయేంత ఆదాయం ఉందని అర్థం. 100 కంటే తక్కువ విలువ అంటే సగటు కుటుంబానికి హౌసింగ్ లోన్‌కు అర్హత పొందేందుకు తగిన ఆదాయం లేదని భావిస్తారు. 100 కంటే ఎక్కువ విలువ అంటే సగటు కుటుంబానికి హోమ్ లోన్‌కు అర్హత పొందేందుకు సరిపడా ఆదాయం కంటే ఎక్కువ వస్తున్నట్టుగా పరిగణిస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. 193 అంచనా విలువతో కోల్‌కతా మొదటి ఏడు నగరాల్లో అత్యంత చవకైన హౌసింగ్ మార్కెట్‌గా నిలిచింది. ఆ తర్వాత పూణె (183) హైదరాబాద్ (174), బెంగళూరు (168), చెన్నై (162), ఢిల్లీ ( 125) ముంబై (92) ఉన్నాయి. కిందటి ఏడాది కోల్‌కతాలో హెచ్‌పీఏఐ విలువ 212 కాగా, హైదరాబాద్ 196, పూణె (195), బెంగళూరు 185, చెన్నై 181, ఢిల్లీ 140 ముంబై విలువ100గా రికార్డు అయిందని జేఎల్ఎల్ స్టడీ రిపోర్టు పేర్కొంది.
ఇన్ఫ్లేషన్తో ఇబ్బందులు
‘‘2022లో ఇన్ఫ్లేషన్ (అధిక ధరలు) కారణంగా డెవలపర్లు ఖర్చుల భారాన్ని బయర్లపై వేశారు. డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు మరో కారణం. రెపో రేటు పెంపుదల ఫలితంగా హోమ్‌లోన్ వడ్డీలు పెరిగాయి. ఇవన్నీ స్తోమతస్థాయిని తగ్గించాయి” అని జేఎల్ఎల్ పేర్కొంది. 2013లో అన్ని నగరాల్లో స్థోమత చాలా తక్కువ ఉంది. ముంబైలో ధరలు భారీగా ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కోసం హోంలోన్ పొందడానికి సగటు కుటుంబ ఆదాయం సరిపోలేదు. 2013–2021 మధ్య అన్ని నగరాల్లో స్థోమత భారీగా పెరిగింది. గరిష్ట విలువలను చేరుకోవడంతో ఇండ్లను కొనడానికి అనువైన సమయంగా మారింది. ఈ విషయమై జేఎల్ఎల్ ఇండియాలో చీఫ్ ఎకనామిస్ట్ రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ మాట్లాడుతూ ‘‘ప్రాజెక్ట్ కార్యకలాపాలు, ధరలు, ఇతర సంబంధిత పారామీటర్ల గురించి నిర్ణయం తీసుకోవడానికి డెవలపర్లకు అఫర్డబిలిటీ స్కోర్ కీలకం. 2021లో జూన్ నాటికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల కుటుంబ ఆదాయాలు రికవరీ అయ్యాయి. కొనుగోలుదారుల సంఖ్య పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది” అని ఆయన వివరించారు. 2021లో అన్ని నగరాల్లో స్థోమత చాలా బాగుందని అన్నారు. 2022 చివరి నాటి నుంచి 2023 వరకు కూడా స్థోమత స్థాయిలు తగ్గే అవకాశం ఉందని వివరించారు. ‘‘తనఖా రేట్లు 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చు. ధరల ఒత్తిళ్లు ఎక్కువ కావడం, ఆదాయాలు నెమ్మదించడం వలన ఆర్థిక స్థోమత దెబ్బతింటున్నది. ఈ పరిస్థితి తాత్కాలికమే. కొంతకాలం తరువాత పెరుగుతుంది”అని వివరించారు.