- డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పేరెంట్స్ ఆందోళన
కోరుట్ల, వెలుగు: బాలుడు మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. జిల్లాలోని రాయికల్ టౌన్ కు చెందిన పొలాస విజయ్- నందిని దంపతుల కొడుకు వేదాన్ష్ (5)కు సోమవారం తీవ్ర జ్వరం రావడంతో కోరుట్లలోని మమత పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన డాక్టర్ మెడిసిన్ రాసివ్వగా సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి మళ్లీ జ్వరం, విరేచనాలు అవడంతో ఆస్పత్రికి వెళ్లారు.
మెడిసిన్ రాయించుకుని ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం వేదాన్ష్ తీవ్ర ఆస్వస్థతకు గురవడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా.. బాలుడి హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్ సీపీఆర్ చేస్తుండగానే మృతి చెందాడు. ఎలాంటి టెస్టులు చేయకుండానే మెడిసిన్ రాసిచ్చాడని, ఇంజక్షన్ వేయడంతోనే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
పోలీసులు వెళ్లి బాధితులతో మాట్లాడి ఆందోళన విరమించారు. కాగా.. ట్రీట్ మెంట్ లో నిర్లక్ష్యం చేయలేదని, ఇంటి నుంచి తీసుకొచ్చినప్పుడే బాలుడికి కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్ మిట్లపల్లి రాజేశ్ తెలిపారు.
