అఫ్గానిస్తాన్ ఇప్పుడో కొత్త చైనా కాలనీ

V6 Velugu Posted on Aug 23, 2021

కాబూల్ మళ్లీ తాలిబాన్ల వశమైంది. ఊహించినట్టుగానే 20 ఏండ్లుగా అమెరికా నుంచి అఫ్గానిస్తాన్​ దిగుమతి చేసుకుంటున్న ప్రజాస్వామ్యం విఫలమైంది. అఫ్గాన్​ నేటి దుస్థితికి కారణం అక్కడి ప్రభుత్వం, రాజకీయ నాయకులు, సుశిక్షిత సైన్యమే. తమ దేశం కోసం తమకు అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ఇతరులు ఎవరినీ నిందించలేం. అఫ్గాన్ సైన్యం, రాజకీయ నాయకత్వం ఏ మాత్రం పోరాడకుండా ఓటమిని అంగీకరించాయి. అది అక్కడి రాజకీయ, సైనిక నాయకత్వపు స్వభావాన్ని తెలియజేస్తోంది.

భారత ఉపఖండం ఇప్పుడు ఒకింత అశాంతి ప్రాంతం. భారతదేశపు చుట్టుపక్కల పొరుగు ప్రాంతమంతా ప్రమాదకరమైన అస్థిరత్వంలో ఉంది. దుర్మార్గపు దేశమైన పాకిస్తాన్, ఆక్రమణ స్వభావం కలిగిన చైనా ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇది సహజం. దాన్ని ఇప్పుడు బహిరంగంగానే ఆ రెండు దేశాలు చేస్తున్నాయి. పాకిస్తాన్, చైనా ప్రాయోజిత కుటిల కార్యకలాపాలకు అఫ్గాన్ కేంద్రబిందువుగా మారుతోంది. ఇప్పుడు తన సరిహద్దులు, అంతర్గత భద్రతను మరింత జాగ్రత్తతో సంరక్షించుకోవడం భారత్​కు చాలా కీలకం. అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత పది రోజులకు తాలిబాన్లు కాబూల్ ను వశం చేసుకుంటారని నేను ఊహించాను. కాబూల్​ను తాలిబాన్లు ఆక్రమించుకునేందుకు పది వారాలు పడుతుందని అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. నేను పది రోజులేనని చెప్పాను. కానీ, అమెరికా ద్వారా శిక్షణ పొందిన అఫ్గాన్ సైనిక బలగాలు ఒక్క గుండు పేల్చకుండా కేవలం ఆరు రోజుల్లో తాలిబాన్లు కాబూల్ చేరేలా చేశాయి. కింద పేర్కొన్న పరిణామాలు అఫ్గాన్​ లో సమీప భవిష్యత్​లో చోటు చేసుకుంటాయని నాకు అనిపిస్తోంది.

తాలిబాన్ ప్రభుత్వాన్ని చైనా గుర్తించడం
ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించే మొదటి దేశంగా చైనా నిలుస్తుంది. తద్వారా దానికి అంతర్జాతీయ గుర్తింపును అందిస్తుంది. యునైటెడ్​ నేషన్స్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో చైనా శాశ్వత సభ్యదేశం కాబట్టి దాని అధికారిక ప్రకటనకు యూఎన్​లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విలువ ఉంటుంది. చైనా ఏదీ ఊరికే చేయదు. కీలకమైన సైనిక, ఆర్థిక, పరిపాలనాపరమైన చేయూత అందించేందుకు, అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చి వారు స్వేచ్ఛగా వ్యవహరించేందుకు తాలిబాన్లతో చైనా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నదన్నది వాస్తవం. దానికి ప్రతిఫలంగా తాలిబాన్లు ఈ ప్రాంతంలో చైనా ప్రయోజనాలు కాపాడి, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌లో చైనాకు స్వేచ్ఛా సంచారం కల్పించాలి.

చైనా సామ్రాజ్య విస్తరణ
చైనా తన ఆటను ఎంతో లోతుగా ఆడుతుంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యమున్నది. ఈ ప్రాంతపు భౌగోళిక పరిస్థితులను నియంత్రించడంలో ఎంతో కీలకం. చైనా తన సహజ స్వభావంతో ఆ పాత ఆటలు మళ్లీ ఆడుతోంది. 1951లో బలవంతంగా టిబెట్ ను ఆక్రమించుకొని భారత్ తో సరిహద్దు ఏర్పరుచుకుంది. అక్సాయ్ చిన్ ఆక్రమణ, లడాఖ్​లో దుస్సాహసాలు భారత్ ను మునివేళ్లపై నిలబెడుతున్నాయి. తన బెల్ట్ రోడ్ ఇనీషియేటివ్ కోసం పాకిస్తాన్ ను రెండు దశాబ్దాలుగా బందీగా చేసుకొని దొడ్డిదారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశించడం అంతా కూడా చరిత్రలో భాగమే. నేపాల్, శ్రీలంక, మాల్దీవులతో రుణ దౌత్యం వంటివన్నీ కూడా భారత్ ను దిగ్బంధనం చేసి ఈ ప్రాంతంలో ఏకాకిని చేయాలనే చైనా దురుద్దేశంలో భాగమే. అఫ్గాన్ ప్రాజెక్టులోకి రష్యాను చేర్చేందుకు చైనా ఆశజూపుతోంది. అంతే కాదు ఆ దిశగా విజయం సాధించినట్టే కనిపిస్తోంది. చైనా తర్వాత అఫ్గానిస్తాన్​లో తాలిబాన్లను గుర్తించే రెండో దేశం రష్యా అవుతుందని నాకనిపిస్తోంది. 1980లో అఫ్గాన్ ఘట్టం తర్వాత రష్యా తీసుకునే అతి పెద్ద యూటర్న్ ఇదే అవుతుంది.

బెత్తంలా పాకిస్తాన్
చైనా నుంచి ఆర్థిక, సైనిక, రాజకీయ సహకారం తాయిలాలు అందితే కొత్త తాలిబాన్లు చెలరేగకుండా కట్టడి చేసేందుకు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను బెత్తంలా చైనా ఉపయోగించుకుంటుంది. పాక్ దుర్మార్గపు సైన్యం తాలిబాన్లపై ఓ కన్నేసి ఉంచుతుంది. చైనా వ్యూహాత్మక, సైనిక, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్​ పూర్తిగా మిళితమై, రాజీ పడిపోయింది. చైనా ప్రయోజనాలు అంటే పాకిస్థాన్ ప్రయోజనాలనే విషయం ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. పాకిస్తాన్ అధికారికంగానే కాదు అనధికారికంగానూ అమెరికాకు మిత్రదేశం కాదనే విషయం ఇప్పుడు బహిర్గతమైపోయింది. ఇది నేను చెప్తున్న మాటలు కావు. కొద్ది రోజుల క్రితం స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన మాటలివి. భారత్, ఇతర ప్రపంచ దేశాలకు వ్యతిరేకంగా తాలిబాన్లు పోరాటం చేసేందుకు తగిన రవాణా సదుపాయాలు, శిక్షణ, ఆయుధాలు, ఎజెండాను పాకిస్థాన్ సమకూర్చుతుంది. దానికయ్యే ఖర్చు చైనా భరిస్తుంది.

ప్రపంచ సైనిక శక్తిగా ఎదగాలన్న తీరని దాహం కారణంగా భారతదేశం చుట్టూ ఉన్న అస్థిర భౌగోళిక పరిస్థితులను చైనా అన్వేషించి దాన్ని అనుకూలంగా మల్చుకొని దోపిడీ చేస్తుంది. పశ్చిమ దేశాలకు సవాల్ విసరడానికి ముందు ఈ ప్రాంతంలో భౌగోళికంగా, రాజకీయంగా నియంత్రణ సాధించేందుకు చైనా కుటిల ప్రయత్నాలు చేస్తోంది. భారత్ పొరుగున వేగంగా చోటుచేసుకుంటున్న ఈ పరిమాణాలు భారత్ కే కాదు యావత్తు ప్రపంచానికి తీవ్రమైన ఆందోళన కలిగించేవే.

కొత్త తాలిబాన్
అతి కొద్ది రోజుల్లోనే చైనా పట్టాభిషేకంతో కొత్త తాలిబాన్ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌లో కొలువు తీరనుంది. ఈ కొత్త తాలిబాన్లు మెరుగైన వేషధారణతో, మరింత నాగరికంగా ప్రపందానికి చక్కగా కనిపిస్తారు. కొత్త తాలిబాన్లకు బాగా మాట్లాడే, అర్థవంతమైన అధికార ప్రతినిధులు ఉంటారు. వారు ఈ క్రూరమైన ఉగ్రవాద సంస్థను గొప్పగా చూపేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోరు. ఇదంతా కూడా ఒక వారం, పది రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది. తాలిబాన్లను సంస్కరణాత్మకంగా, సరికొత్తగా, ఆధునికంగా, అంతర్జాతీయంగా ఆమోదయోగ్యంగా చైనా చూపనుంది. చైనా ఆడించినట్టు ఆడే తోలుబొమ్మలు కూడా ఇదే ప్రయత్నం చేస్తాయి.

- కె.కృష్ణసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి

Tagged Bjp, China, Pakistan, Afghanistan, Talibans, krishnasagar rao

Latest Videos

Subscribe Now

More News