స్వచ్ఛ కాందహార్

స్వచ్ఛ కాందహార్

కాందహార్‌ అనే మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది... ఎయిర్‌ ఇండియా విమానం హైజాక్‌ ఘటన. అవును ఈ ఫోటో కాందహార్ దే.. అత్యంత క్రూరులు, కరుడు గట్టిన తీవ్రవాదులకు నిలయమైన కాందహార్‌కు సంబంధించిన తాజా ఫొటో ఇది. అమెరికా దళాలు వెళ్లిపోకముందే తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘన్ దేశమంతటా భయాందోళనలతో అట్టుడుకుతున్న వార్తలను ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమని చూస్తున్న తరుణంలో ఈ ఫోటో కొంత ఆశ్చర్యం కలిగించక మానదు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. ఆఫ్ఘనిస్తాన్ కు ఎలా వెళ్లిపోయింది.. తాజాదేనా అనే అనుమానాలు కలగడం సహజమే.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త తాత్కాలిక ప్రభుత్వం పాలన మొదలైన విషయం తెలిసిందే. కాందహార్‌ నగరానికి తాలిబన్లు కొత్త మేయర్‌ను నియమించారు. గత నెల రోజులుగా దేశంలో పాలన స్థంభించిపోయి.. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను చేపట్టిన మేయర్..  స్థానిక మున్సిపల్‌ కార్మికులతో కలిసి ఇలా స్వచ్ఛ్ అభియాన్‌ మొదలు పెట్టారు. కాందహార్  మేయర్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. కాందహార్ తాలిబన్లు విడుదల చేసిన ఈ ఫొటోకు సోషల్ మీడియాలో  వెరైటీ చిత్ర విచిత్రమైన కామెంట్లు వస్తున్నాయి.