
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ గడ్డపై ఒక్క టెర్రరిస్టు కూడా లేడని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక టెర్రరిజాన్ని నామ రూపాల్లేకుండా చేశామని అన్నారు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లన్నీ.. పాకిస్తాన్ నుంచి తమ ప్లాన్లు ఆపరేట్ చేస్తున్నాయని ఆరోపించారు.
ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొన్నదని చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టేదే లేదని పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు. 2021లో తాలిబన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఆ దేశ విదేశాంగ మంత్రి నేతృత్వంలోని బృందం ఇండియాలో అధికారికంగా పర్యటిస్తున్నది. అఫ్గానిస్తాన్‌పై విధించిన ట్రావెల్ బ్యాన్‌ను యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తాత్కాలికంగా సడలించడంతో ఈ పర్యటన సాధ్యమైంది.
శుక్రవారం (అక్టోబర్ 10) విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భేటీ అయ్యారు. ఇండియా, ఆఫ్గనిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత, మానవతా సహాయం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు ఆమిర్ ఖాన్ ముత్తాఖీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘అఫ్గానిస్తాన్‌కు చెందిన ఒక్క ఇంచ్ భూమి కూడా టెర్రరిస్టుల చేతుల్లో లేదు. మా గడ్డపై ఉగ్రవాదానికి స్థానం లేదు. టెర్రరిస్టులందరినీ ఏరిపారేశాం. అఫ్గానిస్తాన్‌లో శాంతిని స్థాపించాం. మిగిలిన దేశాలు కూడా శాంతి స్థాపనకు టెర్రరిస్టులతో కఠినంగా వ్యవహరించాలి. బార్డర్ టెర్రరిజం కారణంగా ఇండియా, అఫ్గానిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’’ అని ముత్తాఖీ అన్నారు.
మాకు ఇండియా మిత్ర దేశం
అఫ్గానిస్తాన్ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ముత్తాఖీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘అఫ్గానిస్తాన్ గురించి సోవియట్ యూనియన్, అమెరికా, నాటో దేశాలను అడిగితే తెలుస్తది. మాతో ఆటలు ఆడొద్దు. పాకిస్తాన్‌తో కలిసి ముందుకెళ్లాలని మేమూ అనుకుంటున్నం. కానీ.. అది వన్‌సైడ్ మాత్రం ఉండదు.
ఇండియాపై టెర్రరిస్ట్ దాడులు లేదా ఆ దేశ వ్యతిరేక దాడులకు మా భూభాగాన్ని ఎప్పటికీ అనుమతించబోం. ఇండియాను మిత్రదేశంగా భావిస్తాం. పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజా సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నం’’ అని ముత్తాఖీ తెలిపారు. కాగా, కష్టకాలంలో ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్‌ను ఇండియా ఆదుకున్నదని ముత్తాఖీ గుర్తు చేసుకున్నారు. ఇండియా సాయాన్ని కొనియాడారు. కాగా, కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేశాయి.
అఫ్గానిస్తాన్‌కు ప్రతిసారీ అండగా నిలిచాం: జైశంకర్
కాబూల్‌లో నాలుగేండ్లుగా మూతపడి ఉన్న ఎంబసీని రీ ఓపెన్ చేస్తున్నట్లు దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. ‘‘అఫ్గానిస్తాన్ సౌర్వభౌమాధికారం, ఇంటిగ్రిటీ, ఇండిపెండెన్స్‌కు ఇండియా కట్టుబడి ఉంది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం కాబూల్‌లో నిర్వహిస్తోన్న టెక్నికల్ మిషన్‌ను ఇండియా ఎంబసీ ఆఫీస్ లెవల్‌కు అప్‌గ్రేడ్ చేసింది. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి.
అఫ్గానిస్తాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా ఇండియా అండగా నిలిచింది. బార్డర్ టెర్రరిజంపై కలిసి పోరాడుదాం. పహల్గాం దాడి, కునార్ భూకంపం.. ఈ రెండు సందర్భాల్లో ఇరు దేశాలు చర్చలు జరిపే అవకాశం లభించింది. ఇరు దేశాల మధ్య బంధాన్ని మెరుగు పరుచుకోవడా నికి ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది” అని జైశంకర్ కోరారు.