
మెదక్ జిల్లాకు ఇందిరమ్మకు విడదీయరాని బంధం ఉందని పస్తాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీ గానే ఇందిరాగాంధీ అమరులయ్యారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని.. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ గా జహీరాబాద్ కావాలని కృషి చేస్తామన్నారు. 2014 తరువాత నిమ్జ్ అభివృద్ది కుంటుపడిందని.. భూమి కోల్పోయిన 5 వేల 612 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.... వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
జహీరాబాద్ పారిశ్రామిక వాడ అభివృద్ది గురించి మాట్లాడుతూ... గీతారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నిమ్జ్ సాధించామన్నారు. జహీరాబాద్ అభివృద్దిలో గీతారెడ్డి కీలకపాత్ర పోషించారంటూ... పారిశ్రామిక వాడ భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగిందని నా దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. నిమ్జ్ లో హుందాయ్ కార్ల ఫ్యాక్టరీ రాబోతుందని తెలిపారు.
నిమ్జ్ కోసం భూమి ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని... సింగూరు ప్రాజెక్ట్ ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక రైతుల పంట విషయం గురించి మాట్లాడుతూ... ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారని... కాని కాంగ్రెస్ ప్రభుత్వంలో వరిపండించిన వారికి రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు పదేళ్లుగా ఉద్యోగాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామని.. మీ అందరూ అండగా ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు. బసవేశ్వరుడి సందేశం అనుసరించి, ప్రతి వర్గానికి సముచిత భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యానికి బసవేశ్వరుని సందేశం మానవతా విలువలపై ఆధారపడి ఉన్న సూచికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్ల్ కార్ పాల్గొన్నారు.