30 ఏళ్ల క్రితం ఆటోలో ప్రయాణించాడు.. ఇప్పుడు కిరాయి ఇచ్చాడు..

30 ఏళ్ల క్రితం ఆటోలో ప్రయాణించాడు.. ఇప్పుడు కిరాయి ఇచ్చాడు..

కేరళలో 30ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్‌కి అప్పు పెట్టిన ఓ యువకుడు ..ఇప్పుడు అతని ఇంటికి వెళ్లి మరీ అప్పు తీర్చాడు. ఎంత ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పరోపకారమనే శబ్దం చాలా తేలికగా కనిపించినా, వినిపించినా ఆ పదంలోని శక్తి, మహిమ వర్ణనాతీతం. తెల్లవారి మేల్కొన్నప్పటి నుంచీ మన దినచర్యలను, సంభాషణలను, ప్రవర్తనలను ఏమైనా పరిశీలించుకుంటున్నామా? అయితే ఎదుటి వ్యక్తి చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే అవసరానికి అప్పు తీసుకొని .దాన్ని తిరిగిచ్చే విషయంలో కూడా నిజాయితీగా ఉండే వ్యక్తులు అరుదుగానే కనిపిస్తారు.  కాని  కేరళలో ఒక మధురమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.  30 ఏళ్ల క్రితం ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఆటో కిరాయి ఇచ్చి ఔరా అనిపించుకున్నాడు.   

కేరళ లోని తిరువనంతపురంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆటో డ్రైవర్‌కి ఇవ్వాల్సిన డబ్బులను 30ఏళ్ల తర్వాత గుర్తుంచుకొని మరీ చెల్లించాడు. అయితే ఇందులో ఆటో డ్రైవర్‌కి ఇవ్వాల్సిన అప్పును గుర్తుంచుకోని ఇవ్వడం గొప్ప విషయమైతే ..ఇవ్వాల్సిన అప్పు కంటే వంద రెట్లు అధికంగా కలిపి ఇచ్చి తన నిజాయితీని, మంచితనాన్ని చాటుకున్నాడు. 30సంవత్సరాల క్రితం ఎస్‌.ఆర్.అజిత్ అనే యువకుడు కొలంచెరికి చెందిన వల్యతుటెల్ బాబు అనే వ్యక్తి ఆటో ఎక్కాడు. అయితే ఆటో ఛార్జీ డబ్బులు 100రూపాయలు తన దగ్గర లేవని..తర్వాత ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. సరిగ్గా అదే వ్యక్తి కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు గుర్తుంచుకొని ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి అప్పుగా ఇవ్వాల్సిన దానికి వంద రెట్లు అధికం ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నాడు.

సమాజంలో మంచివాళ్లు కరువైపోతున్నారు. నిజాయితీపరులు అసలు కనిపించడం లేదు. కాని కేరళలోని తిరువనంతపురంకు చెందిన టీచర్ ఎస్‌.ఆర్.అజిత్ అనే వ్యక్తిని చూస్తే ఈరోజుల్లో ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా అనే సందేహం కలుగుతుంది.  1993లో మువటుపుళలో ఆటో నడుపుతున్న కొలంచెరికి చెందిన వల్యతుటెల్ బాబు అనే వ్యక్తి ఆటో ఎక్కాడు. గమ్యస్తానం చేరుకున్న తర్వాత కిరాయి డబ్బులు తన దగ్గర లేకపోతే తర్వాత ఇస్తానని అప్పు పెట్టాడు. ఈ విషయాన్ని ఆటో డ్రైవర్‌ బాబు మర్చిపోయాడు. కాని టీచర్ అజిత్ మాత్రం మర్చిపోలేదు. సరిగ్గా 30ఏళ్ల తర్వాత అంటే బుధవారం(జూన్7)  కొలంచెరిలోని బాబు ఇంటికి వెళ్లి ఉపాధ్యాయుడు అజిత్ పరిచయం చేసుకున్నాడు. తాను 1993లో ఆటో ఎక్కి డబ్బులు అప్పు పెట్టిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా పని చేస్తున్నానని ..నాడు ఇవ్వాల్సిన 100రూపాయల ఆటో ఛార్జీకి వంద రెట్లు అధికంగా కలిపి ఇచ్చాడు.

తిరువనంతపురంకు చెందిన అజిత్ చంగనస్సేరిలో బీఈ చదువుతున్న సమయంలో మంగళత్‌లోని తన క్లాస్‌మేట్ ఇంటికి వెళ్లాడు. రాత్రి కావడంతో తిరిగి మువటుపుళ వెళ్లేందుకు బస్సు దొరకలేదు. చేతిలో  బస్ ఛార్జీ మాత్రమే ఉంది.  అందుకే ఆటో ఎక్కాడు. మువట్టుపుజ మంగళతునాట నుండి 10 కి.మీ.వరకు ఆటోలో ప్రయాణించాడు. అయితే ఆటో ఛార్జీ డబ్బులు తన దగ్గర లేకపోవడంతో డ్రైవర్‌ బాబు దగ్గర అప్పు పెట్టాడు. ఆ డబ్బునే 30ఏళ్ల తర్వాత గుర్తుంచుకొని మరీ చెల్లించాడు.

గొప్ప మనసున్నోడు..

అయితే 30ఏళ్ల క్రితం ఆటో ఎక్కిన యువకుడు ఉపాధ్యాయుడిగా మారి ఇంటికొచ్చినప్పటికి ఆటో డ్రైవర్ గుర్తు పట్టలేకపోయాడు. స్వయంగా అతను గుర్తు చేయడంతో షాక్ అయ్యాడు. ఆటో కిరాయి డబ్బులు ఇవ్వడానికి 30ఏళ్ల తర్వాత తన ఇంటికి రావడం ..గుర్తు చేసి మరీ అప్పు తీర్చిన అజిత్ పెద్ద మనసు చూసి మురిసిపోయాడు ఆటో డ్రైవర్ బాబు.