3 డాలర్లతో లంబోర్ఘిని కొంటా.. ఐదేళ్ల పిల్లవాడి ఆన్సర్ తో పోలీసులు షాక్

3 డాలర్లతో లంబోర్ఘిని కొంటా.. ఐదేళ్ల పిల్లవాడి ఆన్సర్ తో పోలీసులు షాక్
  • తల్లితో గొడవపడి కార్లో బయటికి వచ్చిన బాలుడు

న్యూయార్క్: ఓ ఐదేండ్ల పిల్లాడు అమెరికా పోలీసులను ఆశ్చర్యపరిచాడు. ఏకంగా హైవే మీద ఎస్​యూవీ కారు నడుపుతూ పోలీసుల కంటపడ్డాడు. అతన్ని అడ్డుకున్న పోలీసులు.. అంత చిన్న వయసులోనే కారు నడుపుతున్న బాలుడ్ని చూసి పరేషాన్ అయ్యారు. పోలీసులను చూసి భయపడాల్సింది పోయి కారు ఆపినందుకు పిల్లవాడే గద్దించే సరికి పోలీసులు మరింత షాకయ్యారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ సీన్ ను అక్కడి పోలీసులు ట్విట్టర్ లో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ షాక్ నుంచి తేరుకుని ఎక్కడికెళ్తున్నావని ప్రశ్నించిన పోలీసులకు చుక్కలు కనిపించే సమాధానం చెప్పాడా పిల్లాడు. ‘‘లంబోర్ఘిని కారు కొనివ్వమని అడిగితే మా అమ్మ కొనివ్వలేదు. అందుకే నేనే కొనుక్కోవడానికి వెళ్తున్నా”అని బాలుడు ఆన్సర్ ఇచ్చాడు. కోట్ల రూపాయల్లో ఉండే లంబోర్ఘిని కారు కొనేందుకు డబ్బులున్నాయా.. అని అడిగితే మూడు డాలర్లు ఉన్నాయని చూపించినట్లు పోలీసులు వెల్లడించారు. తన తల్లితో కారు కావాలని గొడవపడి ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలుడు అంతకుముందెప్పుడూ కారు నడపలేదని, అదృష్టవశాత్తు.. ఎలాంటి ప్రమాదం కాలేదని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.