భూమిని కబ్జా చేశారు..న్యాయం చేయండంటూ.. సీఐ కాళ్లపై పడ్డ బాధితురాలు

భూమిని కబ్జా చేశారు..న్యాయం చేయండంటూ.. సీఐ కాళ్లపై పడ్డ బాధితురాలు
  • పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ చేసినా పట్టించుకోలే..
  • ప్రజావాణిలో ఫిర్యాదుతో తూప్రాన్​ సీఐకి ఎంక్వైరీ బాధ్యతలు 
  • మెదక్ ​జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో ఘటన 

శివ్వంపేట, వెలుగు : సారూ నాకు న్యాయం చేయండి’ అంటూ ఓ మహిళా రైతు సీఐ కాళ్ల మీద పడి వేడుకుంది. మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లికి చెందిన మహిళా రైతు జయలక్ష్మి తన భూమి కబ్జా చేశారంటూ వెల్దుర్తి  పోలీస్ స్టేషన్ లో  ఇదివరకే ఫిర్యాదు చేసింది. పట్టించుకోకపోవడంతో సోమవారం ప్రజావాణిలో ఎస్పీకి కంప్లయింట్​చేసింది. ఈ క్రమంలో మంగళవారం తూప్రాన్​ సీఐ ఎంక్వైరీకి రాగా బాధితురాలు ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకుంది.

ఆమె మాట్లాడుతూ వంశపారపర్యంగా వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ శివారులో సర్వే నంబర్ 180లో 7 ఎకరాల 20 గుంటలు సాగు చేసుకుంటున్నామని తెలిపింది. బతుకుదెరువు కోసం కొన్నాళ్ల కిందట హైదరాబాద్​ వెళ్లగా, తన భూమిని గ్రామానికి చెందిన నరేశ్​కు కౌలుకు ఇచ్చామంది. కాగా, శివ్వంపేట సొసైటీ చైర్మన్ వెంకట్రామ్​ రెడ్డి వెంచర్​ను ఆనుకొని తన భూమి ఉండడంతో విక్రయించాలంటూ పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించింది. అమ్మేది లేదని చెప్పడంతో నాలుగు ఎకరాల భూమి, బోరును  కబ్జా చేసి కడీలు వేశారని చెప్పింది. దీనిపై నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డి దగ్గరికి వెళ్లి కాళ్లపై పడి వేడుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తమకు ఈ భూమే జీవనాధారమని, తన కూతురు పెళ్లికి ఉందని, ఈ భూమి పోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన బొగ్గుల విశ్వనాథం కూడా వెంకట్రామ్​ రెడ్డి తమ భూమికి వెళ్లే దారిని కబ్జా చేశాడని సీఐ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోవడంతో తీసుకెళ్లి బాగు చేయిద్దామంటే దారిలో నుంచి వెళ్లకుండా కంచె వేశాడని ఆరోపించారు. తన భూమిని ఆయనకు అమ్మాలంటున్నాడని లేదంటే దారి లేదని బెదిరిస్తున్నాడని తెలిపారు. పొలానికి వెళ్లేందుకు దారి ఇప్పించి న్యాయం చేయండి సార్ అంటూ వృద్ధుడు విశ్వనాథం సీఐ శ్రీధర్​కు రెండు చేతులు జోడించి వేడుకున్నాడు. ఈ అంశాలపై ఎంక్వైరీ చేసి ఎస్పీకి రిపోర్టు అందజేస్తామని సీఐ తెలిపారు.