చిక్కుల్లో నయనతార.. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ కేసు పెట్టిన ఏబీ ఇంటర్నేషనల్!

చిక్కుల్లో నయనతార.. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ కేసు పెట్టిన ఏబీ ఇంటర్నేషనల్!

లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు.  ఆమెపై సూపర్ స్టార్ రజనీకాంత్ నటించి బ్లాక్ బస్టర్ మూవీ 'చంద్రముఖి ' నిర్మాణ సంస్థ అయిన ఏబీ ఇంర్నేషనల్ కేసు వేసింది. నయనతారపై ఈ సంస్థ కేసు పెట్టడం ఇది రెండోసారి. ఆమె నటించిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' లో తమ సినిమా క్లిప్‌లను అనధికారికంగా ఉపయోగించారని ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

లీగల్ సమస్యలు కొత్తకాదు.. 

నయనతారకు ఈ లీగల్ సమస్యలు కొత్త కాదు. ఇప్పటికే ఆమె మరో వివాదంలో ఉన్నారు. నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీపై ఇప్పటికే తమిళ స్టార్ హీరో ధనుష్ రూ.1 కోటి నష్టపరిహారం కోరుతూ కేసు పెట్టారు. ధనుష్ నిర్మించిన 'నానమ్ రౌడీ దాన్' సినిమాలోని కొన్ని సన్నివేశాలను తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వాడారని వండర్బార్ ఫిల్మ్స్ తరపున ఆయన ఈ కేసు వేశారు. 

కొత్త ఆరోపణలు తెరపైకి..

ధనుష్ వేసిన కేసు ఇంకా కోర్టులో విచారణలో ఉండగానే మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. ఇప్పుడు 'చంద్రముఖి' చిత్ర నిర్మాణ సంస్థ ఏబీ ఇంటర్నేషనల్ కూడా నయనతార డాక్యుమెంటరీపై కేసు వేసింది.  డాక్యుమెంటరీ రూపొందించిన 'టార్చ్ స్టూడియోస్' తమ అనుమతి లేకుండానే 'చంద్రముఖి' సినిమాలోని క్లిప్‌ లను వాడారని, దీనివల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించింది. ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ నిలిపివేయాలని కోరింది. అంతే కాకుండా తమకు రూ. 5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించాలని టార్చ్ స్టూడియోస్ కు అక్టోబర్ 6వ తేదీ వరకు మద్రాస్ హైకోర్టు గడువు ఇచ్చింది.

'నానమ్ రౌడీ దాన్' వివాదంపై స్పందించిన నయన్

ధనుష్  కేసు తర్వాత నయనతారా తన సోషల్ మీడియా వేదికగా ఒక బహిరంగ లేఖను రిటీజ్ చేసింది. ధనుష్ తీరుపై తీవ్రంగా మండిపడింది.  నా డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత లీగల్ నోటీస్ పంపడం మరింత షాకింగ్ కి గురైయ్యాను. ఇది నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపిస్తోంది. ఆడియో లాంచ్‌లలో నీ అమాయక అభిమానుల ముందు ఒక వ్యక్తిగా కనిపిస్తావు కానీ నిజ జీవితంలో నువ్వు అలా ఉండవు అంటూ  ధనుష్‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   కాగా, 'నానమ్ రౌడీ దాన్' సినిమాకి ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, ధనుష్ నిర్మించారు. ఇప్పుడు ఈ కొత్త కేసుతో నయనతార మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.