
హైదరాబాద్, వెలుగు : ఏఐసీసీ దూతగా దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రానికి వచ్చి మూడు రోజులు మకాం వేసినా రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది తెగలేదు. నాయకుల అభిప్రాయాలు తీసుకున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. తన రిపోర్ట్‌ను ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేయనున్నట్లు తెలిసింది. ఆ రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి వర్గం, సీనియర్ల మధ్య లొల్లి నడుస్తున్నది. పీసీసీ కమిటీల ప్రకటనతో ముదిరిన లొల్లి అనేక అంశాలపైకి మళ్లింది. రెండు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. నేతలను ఢిల్లీకి పిలిచి పంచాయితీని పరిష్కరిస్తుందని తొలుత భావించినా అనూహ్యంగా దిగ్విజయ్‌సింగ్‌ను అబ్జర్వర్‌గా రాష్ట్రానికి పంపుతున్నట్లు సోమవారం ప్రకటించింది. వెంటనే ఆయన ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జులతో, తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఢిల్లీలోనే మాట్లాడారు.
మరుసటి రోజు మరికొందరు రాష్ట్ర నేతలతో మాట్లాడి సీనియర్ల భేటీ వాయిదా వేయించారు. బుధవారం సాయంత్రం స్వయంగా హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్ రాత్రి కొందరు లీడర్లను కలుసుకున్నారు. కాగా గురువారం రోజు మొత్తం గాంధీభవన్‌లో ఉండి.. 40 మంది వరకు నేతలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు. ప్రెస్మీట్లో దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని, వాటిని అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించినట్లు చెప్పారు. విభేదాలతో మీడియా ముందుకు వస్తే ఎంత పెద్ద లీడర్ అయినా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. దిగ్విజయ్ మాటలను బట్టి ఆయన విషయాన్ని మరీ అంత సీరియస్‌గా తీసుకోలేదని, అయితే వివాదాన్ని పరిష్కరించేందుకు ఒక మార్గం చూపుతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అయినప్పటికీ రెండు పర్యాయాలు అధికారానికి దూరమైందని, ఇప్పుడు ప్రజలకు పార్టీని దగ్గర చేయాలని దిగ్విజయ్ సూచించినట్లు నేతలు తెలిపారు.
ఒకటీ రెండు రోజుల్లో హైకమాండ్‌కు రిపోర్ట్!
వాస్తవానికి దిగ్విజయ్ సింగ్‌కు 2 వర్గాలు ఫిర్యాదు చేశాయి. రేవంత్‌ను మార్చాలని వ్యతిరేక వర్గీయులు, రేవంత్ లేకుంటే పార్టీనే లేదని అనుకూలవర్గం చెప్పినట్లు తెలిసింది. సీనియర్లని చెప్పుకుంటున్న చాలా మంది కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని అనుకూల వర్గం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరి అభిప్రాయాలు విన్న దిగ్విజయ్ ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్‌కు తన నివేదిక సమర్పిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్య నేతల అంచనా ప్రకారం రాష్ట్ర ఇన్చార్జ్ మార్పు లేదా ముగ్గురు, నలుగురు సభ్యులతో హైపవర్ కమిటీని వేసే అవకాశాముంది.
బీఆర్ఎస్, బీజేపీ నడుమ లోపాయికారీ ఒప్పందం: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కొన్ని కారణాలతో అధికారంలోకి రాలేకపోయిందని, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాత్రం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో తలపడుతున్నట్లు బీఆర్ఎస్ నటిస్తూనే పార్లమెంట్లో బిల్లులపుడు సమర్థిస్తుందోన్నారు. ఆ 2 పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీర్ఎస్, దేశంలో బీజేపీ.. కాంగ్రెస్ నేతల్ని కొంటోందన్నారు. ‘‘కేసీఆర్ ఎంఐఎం దోస్తానా వదులుకోరు. ఆ పార్టీ కూడా అంతిమంగా బీజేపీని గెలిపించే రీతిలోనే వ్యవహరిస్తుంది” అని దుయ్యబట్టారు. ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిందని, కేసీఆర్ 12 శాతం ఇస్తానని చెప్పి మొండి చెయ్యి చూపారని విమర్శించారు.