ఫ్రీబీస్‌ కాదు.. అవి ప్రజల హక్కు

ఫ్రీబీస్‌ కాదు.. అవి ప్రజల హక్కు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న గోవాలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్‌ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త స్కీమ్‌ను తెరపైకి తెచ్చారు. ఆదివారం గోవాలోని నవేలిమ్‌లో పర్యటించిన ఆయన మహిళలను ఆకట్టుకునేందుకు 18 ఏండ్లుపై బడిన ప్రతి మహిళకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గృహిణులకు ‘గృహ ఆధార్‌‌’ పథకం కింద నెల నెలా రూ.2500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. తాము ఆధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. పద్దెనిమిదేళ్లు పైబడిన ప్రతి మహిళకు నగదు అందించే ఇలాంటి పథకాలు ప్రపంచంలోనే లేవని, ఇదే అతి పెద్ద మహిళా సాధికారత ప్రోగ్రామ్ అని కేజ్రీవాల్ అన్నారు.

ఫ్రీబీస్‌ కాదు.. అవి ప్రజల హక్కు

ప్రజలకు ప్రకటించే పథకాలను ఫ్రీబీస్‌ అనడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ‘‘కొన్ని రాజకీయ పక్షాలు కేజ్రీవాల్ ఫ్రీబీస్ (ఉచితాలు) ఇస్తున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకూ మంత్రులు మాత్రమే ప్రజల డబ్బుతో ఫ్రీబీస్ పొందుతున్నారు. లీడర్లు పొందేవి మాత్రమే ఫ్రీబీస్. ప్రజలు అందుకునేవి ఫ్రీబీస్ కాదు.. అవి వాళ్ల హక్కు” అని ఆయన అన్నారు. మరికొద్ది నెలల్లోనే గోవాలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మొత్తం 40 అసెంబ్లీ సీట్లలోనూ ఆమ్‌ ఆద్మీ పోటీ చేయబోతున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. కాగా, మరోవైపు 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే స్కీమ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోనూ ప్రకటించింది. ఆ రాష్ట్రంలోనూ వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.