రైతు ఉద్యమానికి పాప్ స్టార్ రిహన్నా మద్దతు.. కంగన ఫైర్

రైతు ఉద్యమానికి పాప్ స్టార్ రిహన్నా మద్దతు.. కంగన ఫైర్

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనలకు హాలీవుడ్ పాప్ స్టార్ రిహాన్నా, స్వీడిష్ క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్డ్ మద్దతు తెలిపారు. వీరితోపాటు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ కూడా అన్నదాతలకు సపోర్ట్‌‌గా నిలిచారు. భారత్‌‌లో నిరసనలు కొనసాగిస్తున్న రైతులకు మనం సంఘీభావం తెలుపుదాం అంటూ గ్రెటా ట్వీట్ చేశారు.

గతేడాది కరోనా టైమ్‌లో దేశంలో నీట్, జేఈఈ పరీక్షలపై గ్రెటా థన్‌‌బర్గ్ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అటుంచితే రైతులకు పాప్ స్టార్ రిహన్నా కూడా మద్దతు తెలిపింది. అన్నదాతల ఉద్యమం గురించి ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు అంటూ రిహన్నా ట్వీ్ట్ చేసింది. ఆమె ట్వీట్‌‌పై బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఫైర్ అయ్యింది. రిహన్నాను ఓ ఫూల్ అంటూ కంగన విమర్శించింది.

వాళ్లు రైతులు కాదు టెర్రరిస్టులు: కంగనా రనౌత్
‘రైతుల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకంటే వారు అన్నదాతలు కాదు టెర్రరిస్టులు. వాళ్లు భారత్‌‌ను విభజించాలని యత్నిస్తున్నారు. అది విజయవంతమైతే విభజిత ఇండియాను చైనా స్వాధీనం చేసుకొని దాన్ని చైనీస్ కాలనీగా మారుస్తుంది. నువ్వో (రిహన్నా) ఫూల్‌‌వి. మీలాగా మేం మా దేశాన్ని అమ్మడం లేదు’ అని కంగన విమర్శించింది.

రిహన్నాపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా కూడా సీరియస్ అయ్యాడు. ‘రైతులపై మా దేశం గర్వంగా ఉంది. వారి ప్రాధాన్యత ఏంటో మాకు తెలుసు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతున్నా. మా అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని రిహన్నాను ఉద్దేశించి ఓజా ట్వీట్ చేశాడు.

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీనా హ్యారిస్ ట్వీట్ చేశారు. ఇంటర్నెట్‌‌ను షట్‌డౌన్ చేస్తున్నారని, నిరసనలు చేస్తున్న రైతులపై పారామిలటరీ బలగాలు దాడులకు దిగుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.